Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనోహరన్ పెరియస్వామి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతీయులు సందర్శించేందుకు మలేషియా సురక్షితమైన వాతావరణంలో ఉన్న దేశమని మలేషియా టూరిజం ఇంటర్నేషనల్ ప్రమోషన్ డివిజన్ (ఆసియా-ఆఫ్రికా) సీనియర్ డైరెక్టర్ మనోహరన్ పెరియస్వామి తెలిపారు. మలేషియా టూరిజం తరచుగా భారత్లో టూరిజం రోడ్ షోలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతున్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఈ రోడ్ షోలకు ఫుల్ స్టాప్ పడింది. కరోనా ప్రభావం తగ్గడంతో మలేషియా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అంతర్జాతీయ పర్యాటకుల కోసం సరిహద్దులను తెరవడం, భారత్ అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించడంతో తిరిగి రోడ్ షోల నిర్వహణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి 30 వరకు భారత్లోని ప్రధానమైన ఆరు నగరాల్లో కార్యక్రమాలను తలపెట్టింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మలేషియా టూరిజం సిబ్బంది, మలేషియా ఎయిర్ లైన్స్, 22 మంది ట్రావెల్ ఏజెంట్లు, ఆతిథ్యరంగానికి చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహరన్ పెరియస్వామి మాట్లాడుతూ 2019లో భారతదేశం నుంచి 7,35,309 మంది పర్యాటకులు సందర్శించారని తెలిపారు. గతంలో ఉన్న కనువిందైన వాటితో పాటు అదనంగా ఔట్ డోర్ థీమ్ పార్క్, జెంటింగ్, స్కై వరల్డ్, కౌలాలంపూర్ లోని రీఫర్నీష్డ్ సన్ వే రిసార్ట్, వన్ అండ్ ఓన్లీ డెసారు కోస్ట్, డెసారు కోస్ట్ లోని లగ్జరీ రిసార్ట్, బీచ్ ప్యారడైజ్, ప్రపంచంలో రెండవ అతి పెద్ద భవంతి తదితర 118 కొత్త అంశాలున్నాయని వివరించారు. సమావేశంలో టూరిజం మలేషియా (సౌత్ ఇండియా, శ్రీలంక) డైరెక్టర్ రజైదీ అబ్ద్ రహీం పాల్గొన్నారు.