Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉపాధ్యాయుల స్పష్టీకరణ
- అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకొండి: ప్రభుత్వ టీచర్లకు మంత్రి సబిత విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్ లెక్చరర్ వంటి పదోన్నతులన్నీ తమకే దక్కుతాయని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఆలోచించి నిర్ణయం చెబుతామని వారు మంత్రికి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ), లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (ఎల్సీజీటీఏ) ప్రతినిధులతో చర్చలు జరిపారు. విద్యాశాఖలోని అన్ని పదోన్నతులకూ జీవోనెంబర్ 78, 259 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు అర్హులనీ, ఉమ్మడి సీనియార్టీ అమలు సాధ్యం కాదని ఆ సంఘాలు మంత్రికి వివరించాయి. చట్టం ప్రకారం అన్ని పోస్టులూ ప్రభుత్వ ఉపాధ్యాయులకే చెందుతాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల మీద ఉన్న కేసులను, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇటీవల పదోన్నతుల కోసం వేసిన కేసులను కాదని ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులే సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మాచారి, అసోసియేట్ అధ్యక్షులు కె దశరథ్, కోశాధికారి, బి సైదులు, తెలంగాణా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు మనోహరాచార్య, గౌరవాధ్యక్షులు విశ్వనాధం గుప్త, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కోశాధికారి విక్రమాదిత్య, నాయకులు వేణు మాధవ శర్మ, జీటీఏ నాయకులు గిరివర్ధన్, బి నర్సింహా, తాళ్లపల్లి ప్రకాష్, గుజ్జా వెంకటేశం, కృష్ణ, నర్సింహా, గోపాల్, బి విద్యాసాగర్, బాశెట్టి నాగవేందర్, ఎల్సీజీటీఏ అధ్యక్షులు ఎం వీరాచారి, నాయకులు రమేష్‌రావు, సురేందర్, రవీందర్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, కె జనార్ధన్‌రెడ్డి, చావ రవి, కె జంగయ్య, టి లక్ష్మారెడ్డి (టీఎస్‌యూటీఎఫ్), మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్), ఎం చెన్నయ్య, ఎం అంజిరెడ్డి, సత్యనారాయణ (పీఆర్టీయూతెలంగాణ), ఎం రఘుశంకర్‌రెడ్డి, టి లక్ష్మారెడ్డి (డీటీఎఫ్), హన్మంతరావు, నవాత్ సురేష్ (టీపీయూఎస్), బి కొండయ్య, ఎస్ మహేష్ (ఎంఎస్టీఎఫ్), టి లచ్చిరాం, పి రఘునందన్‌రెడ్డి (టీయూటీఎఫ్), కరివేద మహిపాల్‌రెడ్డి (ఎస్జీటీయూ)తోపాటు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.