Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులర్ ఎంప్లాయిమెంట్ లేదు..
- కన్సాలిడేటెడ్ పేమెంట్సే..
- వీఆర్ఎస్ వేగవంతం
- ఆర్థికభారం తగ్గింపే లక్ష్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉద్యోగుల కుదింపు, ఆర్థిక భారం తగ్గింపే లక్ష్యంగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇటీవల జరిగిన పాలకమండలి (బోర్డు) సమావేశంలో నిర్ణయాధికారాలను ఆర్టీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌కే కట్టబెడ్తూ చర్చ జరిగిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులు, మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి వారసుల కోసం కారుణ్య నియామకాలు చేపడతామని ప్రకటించారు. దాదాపు 1,200 మంది ఉద్యోగ కుటుంబాల వారసులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వారసులకు రెగ్యులర్ ఎంప్లాయిమెంట్ (పర్మినెంట్) ఇచ్చేవారు. కానీ బోర్డు సమావేశంలో వారిని రెగ్యులర్ పద్ధతిలో కాకుండా కన్సాలిడేటెడ్ పేమెంట్ ద్వారా నియమించుకోవాలని నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలం సంస్థలో సర్వీసు చేస్తూ, అనారోగ్యాలతో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులను ఈ నిర్ణయంతో అవమానించడమే అవుతుందని కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ఈ తరహా నియామకాలు గతంలో ఆర్టీసీలో ఎప్పుడూ జరగలేదు. కన్సాలిడేటెడ్ పేమెంట్ స్థానంలో క్యాజువల్ నియామకాలు చేపడితే, నిర్ణీత కాలవ్యవధి తర్వాత వారిని పర్మినెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే యాజమాన్యం ఆ పద్ధతి కూడా వద్దని నిర్ణయించినట్టు సమాచారం. పల్లెలకు, మారుమూల ప్రాంతాలకు, అక్యుపెన్సీ రేషియో లేని రూట్లలో బస్సుల్ని తిప్పొద్దని యాజమాన్యమే అధికారులకు అనధికార ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజా రవాణా 'సామాజిక బాధ్యత' అనే విషయాన్ని ప్రభుత్వం, యాజమాన్యం విస్మరిస్తున్నాయి. పక్కా వ్యాపారం చేయాలే తప్ప, ఇలాంటి 'బాధ్యతలు' భారం అవుతాయనే భావిస్తున్నారు. ఫలితంగా రూట్లను కుదించి, బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని ప్రచారం చేస్తూ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు యాజమాన్యం ప్రోత్సహిస్తున్నది. ఒక్కో బస్సుపై ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తారు. బస్సుల సంఖ్యను కుదించడంతో వారికి పనిలేకుండా పోతున్నది. డ్యూటీలకు వచ్చినా మస్టర్లు ఇవ్వట్లేదు. సెలవులు పెట్టుకోవాలని డిపో మేనేజర్లు చెప్తున్నారు. అప్పటికీ కార్గో సర్వీసుల్లో హమాలీ పనులు చేసేందుకు కూడా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు సిద్ధపడుతున్నారంటే పరిస్థి తులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగం చేసేకంటే వీఆర్ఎస్ తీసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని యాజమాన్యం ఉద్యోగులకు కల్పిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండువేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు సుముఖత వ్యక్తం చేశారని యాజమాన్యం ప్రకటించింది. అయితే అందరికీ ఒకేసారి వీఆర్ఎస్ ఇస్తే ఆర్థిక కష్టాలు వస్తాయని, దశలవారీగా వారిని ఇండ్లకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. వీరితో పాటు ఏటా రిటైర్ అయ్యే ఉద్యో గులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఏడాదిన్నర క్రింత రిటైర్ అయిన ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఇప్పటికీ బస్‌భవన్ చుట్టూ తిరుగుతున్నారు. టీఎస్ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్యను క్రమేణా 20వేల నుంచి 22వేల వరకు కుదించేలా నిర్ణయాలు జరుగు తున్నట్టు సమాచారం. కన్సాలిడేటెడ్ పేమెంట్స్ కారుణ్య నియామకాల విధివి ధానాల రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. దీనిలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, లీగల్ అడ్వయిజర్‌తో పాటు మరో సీనియర్ అధికారి కూడా ఉన్నారని బస్‌భవన్ వర్గాలు తెలిపాయి.