Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలు నివాసముంటున్న గుడిసెలకు పట్టాలివ్వాలి
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలయ్య
నవతెలంగాణ-హన్మకొండ
ప్రభుత్వ చెరువు శిఖం, దేవాదాయ భూములు కాపాడాలని, ప్రభుత్వ భూముల్లో పేదలు నివాసముంటున్న ఇండ్లకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు ఉప్పలయ్య మాట్లాడుతూ 20 రోజుల నుంచి సీఐటీయూ, ఐద్వా, టీఎస్జీఏ, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండలోని వివిధ పేదల కాలనీల్లో సర్వేలు చేపట్టామన్నారు. ఈ సర్వేలో కరోనా తర్వాత పేదలు ఉపాధి కోల్పోయి జీవించడమే కష్టంగా మారినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. పేదలు ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు.. ఇలాంటి వన్నీ కట్టలేక నానా తంటాలు పడుతున్నామన్నారు. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్థలాల్లో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, తీరా గద్దెనెక్కాక ప్రజలను మోసం చేసిం దని విమర్శించారు. సర్వే నెంబర్ 89లో 20.01 గుంట ప్రభుత్వ చెరువు శిఖం భూమి మొత్తాన్ని పెద్దలు, రియల్టర్లు ఎకరాల కొద్దీ ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూముల సర్వేలు చేపట్టి హద్దులు ఏర్పాటుచేసి వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు రోజా, అరుణ, అనిత, మాధవి, బాబూరావు, రమేష్, నరేష్, శశి, నాగరాజ్, శంకర్, తిరుపతి పాల్గొన్నారు.