Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతి భవన్ ముట్టడి
- ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నాల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలనీ, పల్లె ప్రకృతి వనాల్లో వికలాంగులకు ఉపాధి కల్పించాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారికి ఐదుశాతం కేటాయించాలనీ, ప్రతి నెల ఐదో తేదీలోపు ఆసరా పింఛన్లు పంపిణీ చేయాలనీ, ప్రతినెల సదరం క్యాంప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వికలాంగులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారనీ, వాటిని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాంగులకు వైకల్య ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ మార్కెట్లలో, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో షాపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పెయిడ్ పార్కింగ్ స్థలలను వికలాంగులకు లీజుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వసతి భోజనం కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు పదిహేను రోజుల్లోపు మంజూరు చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా పరిధిలో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందనీ, ఇందులో ఐదు శాతం వికలాంగులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పరికరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సొంత ఇల్లు లేక అనేక మంది వికలాంగులు ఇండ్ల కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి, అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం కేంద్ర కమిటీ సభ్యురాలు సాయమ్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు ధర్నాను ఉద్దేశించి ఈ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్, ఉపేందర్ మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోట్ల గౌతం,పి బాలేశ్వర్ మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి మధుబాబు ,రామకృష్ణ మాట్లాడారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు కషప్ప మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల కోసం జిల్లా వ్యాప్తంగా వికలాంగులు ధరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబ్ కార్డులేదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు లింగయ్య, వెంకన్న మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి జే రాజు మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాజా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా లో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గైని రాములు మాట్లాడారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బస్వరాజ్ మాట్లాడారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు దశరథ్, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.