Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పటివరకు నిరంతర ఉద్యమాలు
- ప్రతి దళిత కుటుంబాన్ని దరఖాస్తు చేయిస్తాం.. ఇవ్వకపోతే నిలదీస్తాం
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ ప్రభుత్వానికి హెచ్చరిక
నవతెలంగాణ-మంచాల
ప్రతి ఒక్క దళితునికీ దళితబంధు ఇచ్చేంతవరకూ నిరంతర ఉద్యమాలు చేపడతామని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయమాటలు చెబుతూ కాలం గడుపుతుందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడితే దళితులకు భూమి, డబుల్ ఇండ్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అధిక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. దళితు బంధు పథకాన్ని నియోజకవర్గంలో 100మందికి కేటాయిస్తే, అది కాస్తా గ్రామానికి ఒకరు చొప్పున.. అదీ టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళితబంధు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.స్వామేల్, వృత్తి సంఘాల నాయకులు పగడాల యాదయ్య, రైతు సంఘం నాయకులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, నాగిల్ల శ్యాం సుందర్, మండల అధ్యక్షకార్యదర్శులు గడ్డం యాదగిరి, కొండిగారి బుచ్చయ్య, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు ఆనంద్, నాయకులు పొచమొని కృష్ణ, పుల్లగల్ల గోపాల్, మారబుగ్గ రాములు, చీదెడ్ సర్పంచ్ బైరిక రమాకాంత్ రెడ్డి, జపాల్ ఎంపీటీసీ లట్టుపల్లి చంద్ర శేఖర్‌రెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిలివేరు రాజు తదితరులు పాల్గొన్నారు.