Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న ఎఫ్‌సీఐ
- యాసంగిలో రా రైస్ సేకరించేందుకే సర్కారు నిర్ణయం
- బాయిల్డ్ మిషన్‌పై పని చేసే వారికి పని కరువు
- వారిని తొలగించేందుకు
సిద్ధమైన యాజమాన్యాలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అత్యధికంగా వరి పండించే జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్మిల్లులూ అదేస్థాయిలో ఉన్నాయి. ఎండాకాలంలో వచ్చే (యాసంగి) వరి పంటలో నూక ఎక్కువగా వస్తుందని పెద్దఎత్తున ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేసి ఉప్పుడు బియ్యంగా మార్చే యంత్రాలు వెలిశాయి. సాధారణంగా రా రైస్‌మిల్లులో ధాన్యాన్ని ముడిబియ్యంగా మరపట్టించే ప్రక్రియలో ఉండే ఆపరేటర్ల కంటే బాయిల్డ్ మిషన్‌పై అదనంగా మరో ముగ్గురు, ఆపై నలుగురు వరకు పని చేస్తారు. ఇన్నాళ్లూ వారికి యాసంగి సీజన్లో చేతినిండా ఉండేది. ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్‌ను తీసుకోబోమని కేంద్రం, రా రైస్ మాత్రమే తీసుకుంటామన్న రాష్ట్ర సర్కారు నిర్ణయం నేపథ్యంలో బాయిల్డ్ మిల్లులకు పనిలేకుండా పోయింది. దీంతో ఆ మిషన్లపై పని చేసే ఆపరేటర్లను తొలగించేందుకు యజమానులు ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాయిల్డ్ రైస్ మిల్లులు 2500వరకు ఉన్నాయి. బాయిల్డ్ రైస్ మిల్లుల్లో 12000 మంది వర్కర్స్ పని చేస్తున్నారు.
దశాబ్దాల కిందటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌మిల్లులు ఏర్పడ్డాయి.. యాసంగి సీజన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యం చివరన విరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు దశాబ్దాల కిందటే బాయిల్డ్ (ఉప్పుడు) బియ్యం విధానం అమల్లోకి వచ్చింది. ధాన్యాన్ని నానబెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి, ఆరబోసి ఆ తరువాత మిల్లింగ్ చేస్తారు. ఇందుకు మిల్లులో ప్రత్యేక యంత్రాలు అమర్చుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాదికేడాది అదనంగా యాసంగి దిగుబడి లక్షల మెట్రిక్ టన్నుల్లో దిగుబడి వస్తోంది. పదేండ్ల కిందటి వరకు 4లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటని యాసంగి ధాన్యం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18.5లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 20లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనీసంగా 150వరకు కొత్తగా బాయిల్డ్ రైస్‌మిల్లులు ఏర్పడ్డాయి.
ప్రశ్నార్థకంగా ఆపరేటర్ల పరిస్థితి
ప్రస్తుతం బాయిల్డ్ బియ్యం తీసుకోబోమని ఎఫ్‌సీఐ తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమీ లేక రాష్ట్ర సర్కారు కూడా మిల్లుల నుంచి యాసంగి ధాన్యం నేరుగా మరపట్టించి రా రైస్ తీసుకుంటామని సూచించింది. దీంతో మిల్లుల్లో బాయిల్డ్ రైస్ ఉత్పత్తికి బిగించిన అదనపు యంత్రాలు బాయిలింగ్, డ్రెయింగ్ ఆపరేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు నుంచి నలుగురు ఆపరేటర్లకు పని లేకుండా పోతుంది. వారిని తొలగించేందుకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని 13 మిల్లుల్లో 28మందిని తొలగించారు. దీంతో ఆందోళన చెందుతున్న బాయిల్డ్ మిల్లు ఆపరేటర్లు తమను ఇతర పనుల్లో వాడుకోవాలని, ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
కలెక్టరేట్ ఎదుట ఆపరేటర్ల ధర్నా
కరీంనగర్ జిల్లా రైస్ అండ్ ఆయిల్, సీడ్ మిల్స్ ఆపరేటర్స్ అండ్ లేబర్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కరీంనగర్ జిల్లా పారా బాయిల్డ్ రైస్ మిల్లుల్లో పని చేస్తున్న ఆపరేటర్ల ఉపాధి రక్షణ, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం -1979 అమలు, కార్మికులు, సౌకర్యాలు రిజిస్టేషన్స్, లైసెన్సింగ్ తదితర అంశాలు అమలు చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షులు చల్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సిహెచ్ భద్రయ్య, ప్రధాన కార్యదర్శి గట్టు సతీష్‌తోపాటు సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.
కనీస సౌకర్యాలు, పని భద్రత కల్పించాలి
పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు సహా మిల్లులో పని చేసే ప్రతి కార్మికునికీ పని భద్రత కల్పించాలి. కార్మికుల వివరాలు పక్కాగా నమోదు చేసి రికార్డులు నిర్వహించాలి. వలస కార్మికుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.
- గట్టు సతీష్- రైస్‌మిల్లు ఆపరేటర్ల యూనియన్ (సీయూటీయూ)
ప్రధాన కార్యదర్శి
బాయిల్డ్ మిల్లు ఆపరేటర్లందరికీ పని కల్పించాలి
బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ తేల్చి చెప్పింది. రా రైస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నిర్ణయంలో పారాబాయిల్డ్ మిల్లుల్లోని బాయిలింగ్, డ్రెయింగ్ ఆపరేషన్ పని చేసే ముగ్గురిని ఆయా మిల్లులు తొలగిస్తున్నాయి. వారి ఉపాధిని కాపాడి, వారికీ పని కల్పించాలి.
- యు.శ్రీనివాస్- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
తొలగించిన ఆపరేటర్లను తిరిగి తీసుకోవాలి
20ఏండ్లుగా పని చేస్తున్న ఆపరేటర్లను ఆయా మిల్లుల యజమానులు తొలగించారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల కార్మికుల స్థానంలో అవసరమైన చోట స్థానికులకే అవకాశం కల్పించాలి. 1979వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలి.
- జి.ముకుందరెడ్డి- ఆపరేటర్ల సంఘం
(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు