Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులకు భూమిపై హక్కు లేకుండా చేస్తున్నారు :
- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
- రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబూరావు
నవతెలంగాణ-పినపాక
ఆదివాసీ చట్టాలపై అవగాహన లేక గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 2వ మహాసభ పినపాక మండలం ఈ-బయ్యారం వద్ద జీవీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముందుగా భూపాలపట్నం నుంచి బయ్యారం క్రాస్ రోడ్డులోని కొమురం భీం విగ్రహం వరకు సంప్రదాయ ఆదివాసీ గిరిజన నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభ ప్రాంగణంలో తెలంగాణ ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేశారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మిడియం బాబురావు మాట్లాడుతూ.. నేటికీ దేశంలో గిరిజన సమాజ పరిస్థితి మెరుగుపడిందేమీ లేదని, ఇంకా వారు బతుకు కోసం, కూడు, గూడు, గుడ్డ కోసం జీవన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. అనేక ఆదివాసీ గిరిజన తెగలు అంతరించి పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నేటికీ గిరిజనులకు విద్యా వైద్యం అందడం లేదన్నారు. పక్కనే గోదావరి ఉన్నా, ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నా గిరిజనుల భూములకు మాత్రం నీరు అందడం లేదని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో పులుసు బొంత ప్రాజెక్టు కేవలం హామీలకే పరిమితమైందని ఆరోపించారు. గిరిజనుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, భాషకు ప్రభుత్వాలు వారిని దూరం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా హక్కులను కాపాడుకోవడానికి గిరిజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. గూడెల్లో, తండాల్లో సమస్యలు చాలా ఎక్కువనే ఉన్నాయని, పోడు వ్యవసాయంపై ఆధారపడి కాయా కష్టం చేసి జీవిస్తున్న గిరిజనులకి ఆ భూమిపై హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసభలో సరియం కోటేశ్వ రరావు, జిల్లా కమిటీ సభ్యులు మడివి రమేష్, మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్నవరపు కనకయ్య, తెలంగాణ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.