Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీస్థాయిలో 503 పోస్టుల భర్తీ
- తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో రాతపరీక్షలు
- మే 2 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జులై/ఆగస్టులో ప్రిలిమ్స్, నవంబర్/డిసెంబర్లో మెయిన్స్
- టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానానికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ సోమవారం మార్గదర్శకాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ సభ్యులు రమావత్ ధన్సింగ్, బి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్ సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. ఆ తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా 503 పోస్టుల భర్తీకి అనితా రామచంద్రన్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత భారీసంఖ్యలో 503 పోస్టులతో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. ఆన్లైన్లో వచ్చేనెల రెండో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. వాటిని సమర్పించేందుకు తుదిగడువు వచ్చేనెల 31వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలు లేకుండానే రాతపరీక్ష ఆధారంగా నియామకాల ప్రక్రియ ఉంటుందని వివరించారు. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో 33 జిల్లాల్లోనూ జులై/ఆగస్టులో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు. మెయిన్స్‌ను రాతపరీక్ష ఆధారంగా నవంబర్/డిసెంబర్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రూప్-1కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఓటీఆర్ ఉంటేనే దరఖాస్తు చేసేందుకు అవకాశముంటుందనీ, కొత్త జోనల్ విధానం ప్రకారం అభ్యర్థుల వివరాలను అప్లోడ్ చేయాలని కోరారు. గ్రూప్-1లో క్రీడలు, ఈడబ్ల్యూఎస్ కోటాను మొదటిసారిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు పోస్టులకు అనుగుణంగా రూల్‌ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 1:50 నిష్పత్తి చొప్పున ప్రతి మల్టీజోన్ నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో రాతపరీక్షలుంటాయని తెలిపారు. మెయిన్స్‌కు సంబంధించి ఈ-ప్రశ్నాపత్రాన్ని రూపొందించడంతోపాటు ప్రక్రియ వేగవంతమయ్యేలా డిజిటల్ మూల్యాంకనం విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని ప్రకటించారు. అభ్యర్థుల జవాబుపత్రాలను స్కానింగ్ చేసి వాటిని కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేపడతామని తెలిపారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
గ్రూప్-1 పోస్టుల వివరాలు
డిప్యూటీ కలెక్టర్-42, డీఎస్పీ-91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48, ఆర్టీవో-4, డీపీవో-5, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్-5, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెం డెంట్-26, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 -41, అసిస్టెంట్ డైరెక్టర్ (సోషల్ వెల్ఫేర్)-3, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్-5, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్- 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీమెంట్ ఆఫీసర్-2, అడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రెటరీ, ట్రెజరర్ గ్రేడ్-2 (వైద్య ఆరోగ్య శాఖ)-20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/అసిస్టెంట్ లెక్చరర్ (ట్రెజరీలు, అకౌంట్స్ సర్వీసులు)-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40, ఎంపీడీవో-121.