Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటితో దేశానికే ప్రమాదం
- విదేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు
- పెట్టుబడులకు అడ్డంకి ొ అలాంటి పరిస్థితికి దూరంగా ఉండాలి
- విద్య, వైద్యంపై ప్రభుత్వ దృష్టి ొ టిమ్స్ ఆస్పత్రుల శంకుస్థాపనలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కులం, మతం పేరుతో కొందరు చేసే చిల్లర రాజకీయాలు క్యాన్సర్ లాంటివని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి తాత్కాలికంగా గమ్మత్తుగా ఉండి, మజా అనిపించి, శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అన్ని మతాలను, కులాలను సమానంగా ఆదరించే గొప్పదేశం భారతదేశమంటూ ఆ వాతావరణాన్ని చెడగొట్టుకుంటే ఎటూ కాకుండాపోయే ప్రమాదముందని తెలిపారు. ఒకసారి కుల, మతాల క్యాన్సర్ జబ్బు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడతామని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలానా వారి షాపులో పువ్వులు కొనొద్దు.. ఫలానా వారి షాపులో మరొకటి కొనద్దనే ప్రచారంపై ప్రజలు ఆలోచించాలని కోరారు. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పని చేస్తున్నారనీ, ఒకవేళ వారందరినీ ఆయా ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వారికి ఉద్యోగాలు ఎవరిస్తారు? వారి పరిస్థితి ఏం కావాలి? అని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆయన మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ, అందునా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో దేశ విదేశాలకు చెందిన వారు స్థానికంగా ఫ్యాక్టరీలు పెడుతున్నారు. అదే శాంతి, భద్రతలు లేకుంటే పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కుల, మతాల పేరిట సంకుచిత ధోరణలకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఇప్పటికే తెలంగాణ పలు రాష్ట్రాలను అధిగమించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వికలాంగులకు రూ.3,016, అడపిల్లల పెండ్లికి రూ.1,00,116 సాయమందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.
గుజరాత్లో రోడ్లపైకి రైతులు..
'ఏడేండ్ల కిందట ఎలాంటి కరెంటు గోసలుండెనో తెలుసు. ఇవాళ మన వద్ద కరెంటు పోతే వార్త.. ఇండియాలో కరెంటు ఉంటే వార్త.. ఇది వాస్తవం. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఏడేండ్ల కిందట పుట్టిన తెలంగాణలో రాత్రింబవళ్లు కష్టం చేసి తిప్పలు పడితే.. ఈ రోజు బ్రహ్మాండంగా 24 గంటలు కరెంటును అన్ని రంగాలకు ఇచ్చుకుంటున్నాం. ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేల చావుకొచ్చేది. భయంకరమైన పరిస్థితులు. ఏ మూలకు పోయినా బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగేవి. ఇవాళ తెలంగాణ బిందెల ప్రదర్శన రద్దయ్యింది. మిషన్ భగీరథ పుణ్యమాని బ్రహ్మాండంగా మంచినీళ్ల కొరత తీర్చుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు పథకాల వల్ల సాగునీరులో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. ధ్యానం పండించడంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నాం' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఫార్మాసిటీ.....
'హైదరాబాద్‌లో దాదాపు రూ.2.30 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం ఏడేండ్లలో. సుమారు 10, 15లక్షల మంది పిల్లలకు ఆయా ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికాయి. రేపు హైదరాబాద్‌లో సిటీలో 14 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మాసిటీ తేబోతున్నాం. జీనోమ్‌వ్యాలీలో తయారవుతున్న వ్యాక్సిన్లతో ప్రపంచానికే రాజధానిగా ఉన్నాం. ప్రపంచంలోనే 33 శాతం టీకాలు తయారీ కేంద్రం హైదరాబాద్' అని సీఎం పేర్కొన్నారు.
విద్యా, వైద్యంపై దృష్టి
'ప్రభుత్వం ఇకపై వైద్యం, విద్యపై దృష్టి సారిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వంరంగంలో వైద్యకళాశాలలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎక్కడికక్కడే విద్య, వైద్యసేవలు పేదల ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ చేయగలిగామంటే, మహా మహా రాష్ట్రాలను దాటి ముందుకు పోగలుగుతున్నామంటే.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా కరెంటు ఇస్తున్నామంటే దానికి ప్రజలిస్తున్న మద్దతే కారణం. పటిష్టంగా తెలంగాణ పచ్చబడాలే.. ఇంకా ముందుకెళ్లాలే.. దేశానికే తలమానికంగా ఉండేలా రాష్ట్రం తయారు కావాలి. దాని కోసం ఎంత ధైర్యంగానైనా ముందుకుపోతాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఈ దుష్టశక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం' అని కేసీఆర్ తెలిపారు.