Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ప్రత్యేక ఇంక్రిమెంట్ హైకోర్టు ఉద్యోగులకు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. 2014 ఆగస్టు 13న జీవో 23ను హైకోర్టు, జిల్లాల్లోని కోర్టు ఉద్యోగులకు అమలు చేయకపోవడాన్ని తప్పుపడుతూ హైకోర్టు అసిస్టెంట్ మాజీ రిజిస్ట్రార్ యాకయ్య హైకోర్టును ఆశ్రయించారు. మూడు మాసాల్లోగా హైకోర్టు ఉద్యోగులకు కూడా ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలని పేర్కొంటూ విచారణ ముగించింది.
అక్కడే తేల్చుకోండి
హైదరాబాద్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ మేనేజిమెంట్ నిర్వహణకు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ చర్యలు తీసుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన లలిత్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. బయో మైనింగ్ నిర్వహించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. ఎన్జీటీలో ఉన్న న్యాయ వివాదంపై తాము విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిట్లోని విషయాలను ఎన్జీటీలో చెప్పుకోవాలని సూచించింది. రిట్‌పై విచారణకు తెరదించింది
జీవో 111పై రెండ్రోజుల్లో వివరణ ఇవ్వండి
హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతంలో వట్టినాగులపల్లిని కొనసాగించేదీ లేనిదీ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వట్టినాగులపల్లిలోని తమ భూములకు జీవో 111 నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఇవ్వాలన్న నాలుగు రిట్లను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్‌బెంచ్ మంగళవారం విచారించింది. జీవో 111కి సవరణల జీవోలో తమ భూములు ఉండేలా చేయాలని పిటిషనర్లు కోరారు. జీవో 111 పరిధి గ్రామాల విషయంలో ప్రభుత్వం లోతుగా ఆలోచన చేస్తోందని అదనపు ఏజీ చెప్పడంతో రెండు రోజుల్లో ప్రభుత్వ వైఖరిని చెప్పాలని హైకోర్టు కోరింది.