Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్లీనరీలో గిరిజన రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) డిమాండ్ చేసింది. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచుతామని ఆ పార్టీ వాగ్దానం చేసిందని గుర్తు చేసింది. ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారుతోగానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి జీవో జారీచేయడంలోగానీ టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని విమర్శించింది. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా బుధవారం జరగబోయే ప్లీనరీ సమావేశంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఖచ్చితమైన ప్రకటన చేయాలనీ, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈమేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.ధర్మనాయక్, ఆర్ శ్రీరాంనాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2011 లెక్కల ప్రకారం గిరిజన జనాభా 6 నుంచి 9.8 శాతానికి పెరిగిందని తెలిపారు. అందుకనుగుణంగా రిజర్వేషన్లు పెంచకపోవడంతో గిరిజనులకు విద్య,ఉద్యోగ, రాజకీయ అంశాల్లో అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 16(4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉందని తెలిపారు. 50శాతానికి మించితే వాటిని పెంచుకోవడానికి రాష్ట్రానికి హక్కులేదనీ సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నందున కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నదని గుర్తు చేశారు. ఈ విషయంలో గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ చిత్తశుద్దితో పోరాటం చేయకుండా కాలయాపన ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్న క్రమంలో ఎస్టీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీలో చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తునందున రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక గిరిజన తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించాలని కోరారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి ఆర్టికల్16(4) ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్ లోపు జీవో జారీ చేస్తుందా? విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.