Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతికంగా గుర్తించి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోకి డ్రగ్స్‌ను రవాణా చేయడానికి గాను కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్న స్మగ్లర్లు ఈ మారు కోట్ల రూపాయల డ్రగ్స్‌ను ఏకంగా కడపులో దాచుకొని రావడం సంచలనం రేపింది. ఇటువంటి ఒక స్మగ్లర్ గుట్టును డీఆర్ఐ అధికారులు రట్టు చేసి ఏకంగా రూ. 11.57 కోట్లు విలువైన కొకైన్ మాదక పదార్థాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక టాంజానీయన్ దేశస్తుడు అత్యంత రహస్యంగా కొకైన్ మాదక పదార్థాలతో దేశంలోకి అడుగు పెడుతున్నట్టు డీఆర్ఐ అధికారులకు అత్యంత విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో ఈనెల 21వ తేదీన జోహన్స్ బర్గ్ నుంచి వయా దుబారు ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ ఏయిర్ పోర్టుకు చేరుకున్న ఎమిరేట్స్ విమానంలో వచ్చిన టాంజానీయన్ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద తప్పని సరిగా కొకైన్ డ్రగ్ ఉందని కచ్చితమైన సమాచారం ఉండటంతో డీఆర్ఐ అధికారులు నిందితుడిని విచారించారు. దీంతో తాను కొకైన్ మాదకపదార్థాలు ఉన్న క్యాప్సుల్స్‌ని మింగి కడపులో దాచుకున్నట్టు వెల్లడించడంతో డీఆర్ఐ అధికారులు షాక్ తిన్నారు. అంతేగాక నాలుగు రోజుల వరకు ఈ క్యాప్సుల్స్ కడుపులో ఉన్నా ఏమీ కాదని తర్వాతే కొంత సమస్య వస్తుందని స్మగ్లర్ వెల్లడించాడు. దీంతో వెంటనే టాంజానీయన్ను అధికారులు నిమ్స్ ఆస్పత్రికి తరలించి ఆపరేషన్‌ను చేయించి మొదట 57 క్యాంప్సుల్స్ను వెలుపలికి తీయించారు. తర్వాత మరికొన్ని తీయించగా వాటి సంఖ్య 79కు చేరింది. ఒక్కో క్యాప్సుల్‌లో అత్యత జాగ్రత్తగా కొకైన్‌ను నింపి దానికి వెలుపలి నుంచి జాగ్రత్తగా ప్యాక్ చేయంచాక వాటిని సదరు టాంజానీయన్ మింగి తీసుకు వచ్చినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. దాదాపు ఐదు రోజుల తర్వాత ఈ క్యాప్సుల్స్‌ను డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా నిందితుడికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా వెలికి తీశారని వారు వివరించారు.1157 గ్రాముల కొకైన్‌ను ఈ క్యాప్సుల్స్‌లో నింపి తీసుకుని వచ్చాడని తెలిపారు. ఈ డ్రగ్స్‌ను టాంజా నీయా నుచి మొదట జోన్స్ బర్గ్‌కు తీసుకు వచ్చిన అక్కడ వాటిని క్యాప్సుల్స్ రూపంలోకి మార్చాడని తెలిపారు. దీని విలువ మొత్తం రూ. 11.57 కోట్లుగా అధికారులు తేల్చారు. ఈ స్మగ్లర్ ఆచూకిని కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చిందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.