Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్యూపీపీటీఎస్ అధ్యక్షుడు జగదీశ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భాషాపండితులకు 278 జీవో ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్యూపీపీటీఎస్) అధ్యక్షులు సి జగదీశ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విధంగా సర్వీసు రూల్స్ 78, జీవో 278 అమల్లో ఉందని చెప్పారు. వాటి ప్రకారం సీఎం కేసీఆర్ ప్రకటించిన అప్గ్రెడేషన్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని కోరారు. మిగతా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను 278 జీవో ప్రకారం కల్పించాలని సూచించారు. 11, 12 జీవోలు అమల్లో లేవన్నారు. 78, 278 జీవోలు మాత్రమే అమల్లో ఉన్నాయని వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషాపండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆరేండ్లయినా సర్వీసు రూల్స్ పీటముడి వీడకపోవడం వల్ల కాలేదని చెప్పారు. ఎస్జీటీలకు, భాషాపండితులకు కలిపి పదోన్నతులు ఇస్తే అప్గ్రేడ్ కాబోయే భాషాపండితుల పోస్టుల్లో నాలుగు వేల వరకు వారికే దక్కే అవకాశముందన్నారు. అప్గ్రేడ్ కాబోయే పోస్టుల్లో పనిచేస్తున్న భాషాపండితులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. వారు ఎక్కడ సేవలందించాలనీ, జీతభత్యాలు ఎలా చెల్లిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే 278 జీవోను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యూపీపీటీఎస్ ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు, నాయకులు విజరుకుమార్, రాకేశ్, ఎం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.