Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీకరించిన పవర్ ప్రాజెక్ట్స్ చీఫ్ ఎన్వీకే విశ్వనాథరాజు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ ప్లాంట్ (కోల్) అవార్డు లభించింది. మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవాలో జరుగుతున్న రెండ్రోజుల సదస్సులో మంగళవారం ఈ అవార్డును ఆ విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ చీఫ్ (ఈ అండ్ ఎమ్) ఎన్వీకే విశ్వనాధరాజు, అపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ జేఎన్ సింగ్ అందుకున్నారు. దక్షిణ భారత దేశంలోని 75 థర్మల్ విద్యుత్‌ప్లాంట్లను పరిశీలించిన అనంతరం సింగరేణి థర్మల్ కేంద్రానికి ఈ అవార్డు లభించడం విశేషమని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అభినందనలు తెలిపారు. విద్యుత్ ఉత్పాదనలో అతి తక్కువ నెట్ హీట్ రేటును నమోదు చేస్తున్నందుకు ఈ అవార్డును అందచేశారు. సాధారణ ప్రమాణాల ప్రకారం 500 మెగావాట్ల ప్లాంట్‌లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి 2,444 కిలో క్యాలరీస్‌కు లోబడి ఇంధన శక్తి వాడటాన్ని కనీస ప్రమాణికంగా భావిస్తారు. కానీ సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ 2021-22 లో ఈ ప్రమాణాలకు లోబడి 2429 కిలో క్యాలరీస్‌ను నమోదు చేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గోవాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో డీజీఎం (ఇ అండ్ ఎం) వీవీ సుధాకర్‌రెడ్డి, డీజీఎం (ఓ అండ్ ఎం) వీరబ్రహ్మం, డిప్యూటీ ఎస్ఈ సముద్రాల శ్రీనివాస్, ఈఈ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.