Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యాదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతియ ప్రతినిధి
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు తన భూమి పోతుందన్న మనోవేదనతో రైతు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన గ్రీన్‌ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతు షేక్ జానిమియా(43)కు 1.0800 ఎకరాల సాగు భూమి ఉంది. కాగా, గ్రీన్ ఫీల్డ్ హైవే కింద తన భూమినీ కోల్పోనున్నాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ భూములకు ఇచ్చినట్టు ఎకరానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులూ మూడేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. రెండేండ్ల కిందట అఖిలపక్ష నేతల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఎకరానికి కోటి రూపాయలు పరిహారం ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దాంతో రైతులు ఎంజాయిమెంట్ సర్వేకు అంగీకరించారు. కాగా, ప్రస్తుతం ఎకరానికి రూ. 25లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని, రైతులు తప్పనిసరిగా భూములు ఇవ్వాల్సిందేనని చింతకాని తహసీల్దార్ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. రెండు రోజుల కిందట తహసీల్దార్ వందనం గ్రామానికి వెళ్ళి రైతులను పట్టాదారు పాస్‌బుక్, బ్యాంకు ఖాతా ఇవ్వాలన్నారు. ఆధారాలు ఇవ్వకపోతే.. రూ. 10.50లక్షలు మాత్రమే ఇస్తామని, అవీ కోర్టులో జమచేస్తామని, వాటి కోసం పదేండ్లు తిప్పుతామని రైతులను బెదిరించారు. ఈ నేపథ్యంలో రైతు జానిమియా తనకున్న 1.0800 కుంటల భూమిలో ఎకరం భూమి కోల్పోవడం వల్ల తనకు అన్యాయం జరుగుతుందని తీవ్ర మనోవేదనతో సోమవారం ఉదయం మృతి చెందాడు. తన భర్త మృతికి కారణమైన తహసీల్దార్‌పై చర్యలు తీసుకుని, తనకు తగిన న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు మృతితో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైరా సీఐ సురేష్, చింతకాని ఎస్ఐ పొదిలి వెంకన్న పోలీసు పికెట్ నిర్వహించారు.
చింతకాని తహసీల్దార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
రైతు మృతి విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం), తెలంగాణ రైతుసంఘం నాయకులు, సూర్యాపేట-దేవరపల్లి భూనిర్వాసితుల సంఘం నాయకులు జానిమియా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లా డుతూ.. తహసీల్దార్ వేధింపులతోనే రైతు జానిమియా మృతిచెందాడని, తహసీల్దార్‌ను తక్షణమే సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతు మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి మృతుని కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భూనిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించి రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్శించిన వారిలో.. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, తదితరులున్నారు.