Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే 6న వరంగల్‌లో సభ
- అజరులాంటి సైకో మంత్రికి గుణపాఠం చెప్పాలి
- పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలి :
- ఖమ్మం కాంగ్రెస్ ఆఫీసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- ప్రెస్‌మీట్ సందర్భంగా తోపులాట..
- డోర్ల అద్దాలు ధ్వంసం.. ఓ కార్యకర్తకు గాయాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వరి వేయొద్దన్న ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం కారణంగానే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ) అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. విపక్ష నేతలపై పీడీ యాక్టులు, కేసులు పెట్టి వేధిస్తున్న మంత్రి పువ్వాడ అజరు ఓ సైకో అని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మే 6న సాయంత్రం 6 గంటలకు రైతుసంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభ విజయవంతానికి సన్నాహక సమావేశంలో భాగంగా రేవంత్‌రెడ్డి మంగళవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంట ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిందిపోయి వరి వేస్తే రైతుబంధు కట్ చేస్తామని, కొనుగోలు కేంద్రాలు తెరిచేది లేదని సీఎం హెచ్చరించారన్నారు. దాంతో రైతులు తక్కువ ధరకు దళారులు, మిల్లర్లకు అమ్ముకున్నారని, వారికి బోనస్‌తో పాటు ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ధాన్యానికి రూ.1960 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని, దీనికి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు. . రైతులకు కష్టం వచ్చినప్పుడల్లా పోరాటాల్లో ఉన్న ఎర్రజెండా నీడన ఎంతో చైతన్యవంతమైన జిల్లాగా ఖమ్మం గణతికెక్కిందన్నారు. రైతులకు బేడీలు వేసి నడిపించిన టీఆర్ఎస్ను తిప్పికొట్టిన చరిత్ర కూడా ఖమ్మం జిల్లాదే అన్నారు. అలాంటి ఈ జిల్లాలో పువ్వాడ అనే ఓ సైకో మంత్రి ఉన్నారనీ, ఆయన ప్రోత్సాహంతోనే విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలైన ముస్తఫా, మిక్కిలినేని నరేంద్ర, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్‌పై పోలీసులు పీడీ యాక్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టేనని, మాడి మసైపోతావని మంత్రి అజరును హెచ్చరించారు. ఓ యువకుని మరణానికి కారణమైన అజరు.. కమ్మకులాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. పువ్వాడ అజరు అక్రమాలన్నింటిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అజరుకు చెందిన మమత మెడికల్ కళాశాల సిబ్బందికి సగం జీతమే ఇస్తున్న విషయమై విచారణ చేయాలన్నారు. మెడికల్ కాలేజీ విషయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోతే సీబీఐ విచారణకు స్వయంగా లేఖ రాయాలని పువ్వాడ అజరుకు సవాల్ విసిరారు. కేటీఆర్, పువ్వాడ అజరు తోడు దొంగలని విమర్శించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఏఐసీసీ నేతలు అంజన్‌కుమార్, కుసుమకుమార్, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాసరెడ్డి, రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మహ్మద్ జావీద్, బెల్లం శ్రీనివాస్, మారం కరుణాకర్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
తోపులాట.. గాయాలు
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లోని సమావేశ మందిరంలో రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. విలేకరుల సమావేశానికి హాజరయ్యేందుకు రేవంత్‌రెడ్డి, భట్టి, రేణుకాచౌదరి తదితర నేతలు ఒక్కసారిగా లోనికి రావడంతో కార్యకర్తలు వారి వెంటే వచ్చారు. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు డోర్లు మూశారు. అయినప్పటికీ కార్యకర్తలు ఆగకుండా ఒక్కసారిగా బలంగా తోయడంతో డోర్ గ్లాసులు పగిలిపోయాయి. ఒకరినొకరు బలంగా తోసుకోవడంతో పగిలిన గాజు పెంకులు కోసుకుపోయి ఓ కార్యకర్త చేతికి తీవ్ర గాయమైంది. కార్యకర్తలను నిలువరించే క్రమంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ చొక్కా కాలర్‌ను ఓ కార్యకర్త పట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. విలేకరుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్, రేణుకాచౌదరి మంత్రి పువ్వాడ అజరుపై నిప్పులు చెరిగారు.