Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేలుడు పదార్ధాలు.. నగదు స్వాధీనం
- ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగుబాటు :
- విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్‌దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఐ(మావోయిస్టు) ఏసీఎం బస్తర్ సౌత్ డివిజన్ సభ్యుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. ఉదయం దుమ్ముగూడెం ఎస్.ఐ రవికుమార్ తన సిబ్బందితో మారాయిగుడ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగులు తనిఖీ చేయగా పేలుడు పదార్ధాలు లభించినట్టు తెలిపారు. విచారించగా.. చత్తీస్‌గఢ్‌లోని సౌత్ బస్తర్ డివిజన్లో పనిచేస్తున్న మావోయిస్టు మడకం రామ అలియాస్ రమలా, అలియాస్ రమేష్, అలియాస్ రాజుగా గుర్తించారు. 2014లో 4 వ ప్లాటూన్ మెంబర్‌గా మావోయిస్టు పార్టీలో చేరిన మడకం రామ.. 2020లో కుంట ఏరియా కమిటీ మెంబర్‌గా, 2021లో సౌత్ బస్తర్ సప్లరు టీమ్ ఇంచార్జ్‌గా, ప్రస్తుతం సౌత్ బస్తర్ డివిజన్ ఏసీఎంగా పనిచేస్తున్నాడని తెలిపారు. అతని నుంచి పేలుడు పదార్ధాలు, వైర్, బ్యాటరీ, లాండ్ మైన్, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్‌తోపాటు రూ.47,610 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్ట్‌లో హాజరు పరిచినట్టు తెలిపారు. ఇతనిపై ప్రభుత్వ రివార్డు ఉందని చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ రోహిత్‌రాజ్, బెటాలియన్ కమెండర్ ప్రమోద్ పవార్, సీఐ రవికుమార్ పాల్గొన్నారు.
ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగుబాటు
సీపీఐ(మావోయిస్టు) చర్ల ప్రాంతానికి చెందిన ముస్కీ సుక్కి (18) అలియాస్ విమల, చర్ల మండలం చెన్నాపురంకు చెందిన మడకం ప్రమీల(18) అలియాస్ పాలేలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరు 14 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీలో బలవంతంగా రిక్రూట్ చేశారని వారు పోలీసులకు తెలిపారు. మావోయిస్ట్ పార్టీ నాయకులు చాలా మంది మైనర్ గిరిజన పిల్లలను ఏమీ తెలియని చిన్న వయస్సులోనే దళంలోకి తీసుకుపోతున్నారని ఎస్పీ తెలిపారు. తమ భావజాలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గిరిజనులు, బాలల హక్కులను మావోయిస్టు పార్టీ నాయకులు ఉల్లంఘిస్తున్నారని సంచలన వ్యాఖ్యనించారు. మైనర్ గిరిజన బాలికలతో వంట, బట్టలు ఉతికించ డం, సామన్లు మోపించడం లాంటి పలు నీచమైన పనులు చేయమని మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్, దామోదర్, రాజిరెడ్డి, మధు బలవంతం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని బాధితులు తెలిపినట్టు ఎస్పీ చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు రూ.1లక్ష అందజేశారు. విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ రోహిత్‌రాజ్, బెటాలియన్ కమెండర్ ప్రమోద్ పవార్, చర్ల సిఐ అశోక్ పాల్గొన్నారు.