Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండపం పునరుద్ధరణకు రూ.15 కోట్లు మంజూరు
- కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
నవతెలంగాణ-హన్మకొండ
చారిత్రాత్మకమైన వేయిస్తంభాల గుడి తెలంగాణకే కాకుండా యావత్ దేశానికే తలమానికంగా నిలుస్తుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్- హన్మకొండ భద్రాకాళీ దేవాలయంలో అమ్మవారిని, వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామిని కిషన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, రుద్రేశ్వరుడికి అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి పట్టు వస్త్రాలు మంత్రికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన వారసత్వ సంపద పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వేయి స్థంబాల గుడి మండపం అభివృద్ధికి రూ.15కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మడపం నిర్మాణం, పర్యాటకుల సౌకర్యార్థం గ్రీనరీ పార్క్, ఇతర పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు. రామప్ప దేవాలయం అభివృద్ధికీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటకశాఖ అధికారులను కోరారు. ఇంకా, తెలంగాణలో భద్రాద్రి, జోగులాంబ దేవాలయాల అభివృద్ధికి రూ. 33 కోట్లు మంజూరు చేయగా, రూ.5 కోట్లు వెంటనే ఇచ్చినట్టు చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రం రూ.2.50 లక్షలు మంజూరు చేసిన విషయం గుర్తుచేశారు. ములుగు ప్రాంతంలో ట్రైబల్ సైకుట్ పేరుతో రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు ధర్మారెడ్డి, ఏనుగు రాకేష్‌రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.