Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలు చేయాలి
- కార్మిక సంఘాల నేతల డిమాండ్
- లేబర్ కమిషనరేట్ వద్ద ధర్నా
నవతెలంగాణ- అడిక్‌మెట్
కనీస వేతనాల చట్టానికి(1948) లోబడి సవరించి జారీ చేసిన 5 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ల జీవోలను గెజిట్‌లో ప్రచురించి అమల్లోకి తీసుకురావాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అన్ని షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లను తేదీ 19-07- 2017 నాటి కనీస వేతనాల సలహా మండలి తీర్మానాలకు లోబడి సవరించి, వాటికి కూడా జీవోలు ఇచ్చి వెనువెంటనే గెజిట్‌లో ప్రచురించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ..
కనీస వేతనాల చట్టం పరిధిలోని అన్ని షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లకు సంబంధించి వేతన సవరణ చేయాలన్నారు. కార్మిక శాఖ ప్రతిసారీ 2 నుంచి 4 సంవత్సరాలు ఆలస్యం చేస్తూ వేతనాలు, వీడీఏ పాయింట్ల విలువలను తగ్గించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను హరించేలా లేబర్ కమిషనర్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 5 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఫైనల్ జీవోలను విడుదల చేసి గెజిట్‌లో ముద్రించకపోవడం వల్ల పది నెలలుగా కార్మికవర్గం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కనీస వేతనాలను సవరించిన నాటి నుంచి ఇప్పటివరకు నిత్యావసర వస్తువుల ధరలు వంద శతం పెరిగాయని, అందుకు తగినట్టుగా ప్రభుత్వం వేతనాలు మాత్రం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాల చట్టం పరిధిలోని అన్ని షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన వేతన సవరణ ఫైనల్ జీవోలను గెజిట్‌లో ముంద్రించి అమలు చేయాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.చంద్రశేఖర్, విజరుకుమార్ యాదవ్, సామ భాస్కర్‌రెడ్డి(ఐఎన్టీయూసీ), మొహమ్మద్ యూసఫ్, బి.చంద్రయ్య, ఎం.నరసింహా, బొడ్డుపల్లి కిషన్, లక్ష్మి (ఏఐటీయూసీ), పాలడుగు భాస్కర్, కె.వెంకటేశం, కె.రమేశ్ (సీఐటీయూ), రెబ్బ రామారావు(హెచ్ఏంఎస్), కె.సూర్యం (ఐఎఫ్టీయూ), భరత్(ఏఐటీయూసీ), కనీస వేతనాల సలహా మండలి సభ్యులు డి.బిక్షపతి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.