Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందించడంలో జెన్కో విఫలం
- అధికారుల పర్యవేక్షణ కరువు
- జెన్కో సీఈపై సీఎండీ ఆగ్రహం
- జెన్కో డైరెక్టర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు
నవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీలో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వారి పర్యవేక్షణ లేకపోవడం, కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడంతోనే కార్మికులు గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగినా జెన్కో సీఈ సిద్ధయ్య గోప్యంగా ఉంచడంతో జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ సమీపంలో 8 మిల్లర్లు ఉన్నాయి. ఒకవైపు 4 మిల్లర్లు మరోవైపు నాలుగు ఉన్నాయి. వీటిని ఏ,బీ,సీ,డీలుగా పిలుస్తారు. కాగా ఏ మిల్లర్ మరమ్మతుకు రాగా పాల్వంచలో పనిచేసి డిప్యుటేషన్‌పై వచ్చిన ఏడుగురు కార్మికులతో పనులు చేపిస్తున్నారు. ఇదే సమయంలో బి మిల్లర్‌లో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గాయపడిన వారిలో ముగ్గురు కార్మికులు 80శాతం కాలి విషమ పరిస్థితుల్లో ఉన్న వారికి ఎంజీఎంలో ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్‌లోని యశోదకు తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో నలుగురు కార్మికులకు ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. కాగా, కార్మికులు పనులు చేస్తున్నప్పుడు ఎల్సీ తీసుకోవాల్సి ఉండగా ఎలాంటి ఎల్సీ తీసుకోలేదని సమాచారం. అంతేకాకుండా అధికారుల పర్యవేక్షణ లేకుండానే కార్మికులు పనులు చేసినట్టు తెలిసింది. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని, సేఫ్టీ పరికరాలు లేకపోవడమూ మరో కారణమని తోటి కార్మికులు పేర్కొంటున్నారు. ఘటన జరిగిన సమయంలో మంటలు ఆర్పడానికి ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో మంటలు ఎగిసిపడ్డి కార్మికులు గాయపడినట్టు తెలుస్తోంది. సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోకుండా ఏం చేస్తున్నారంటూ జెన్కో సీఈని సీఎండీ మందలించినట్టు సమాచారం.
కాగా, ప్రమాద ఘటనపై జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయగా, వారు మంగళవారం కేటీపీపీకి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. బీ మిల్లర్ ఏవిధంగా పేలిందో పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల పనిచేసిన కార్మికులను, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్నారు. విచారణ అనంతరం పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయి. అయితే కేటీపీపీ సీఈ సిద్ధయ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అక్రమాలు జరిగినా మీడియాకు తెలియకుండా వారిని లోపలికి రాకుండా ఆంక్షలు విధిస్తూ జాగ్రత్తపడుతున్నారు.
కార్మికులకు మెరుగైన వైద్య సేవలు : జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు
కేటీపీపీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్టు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరస్వామి, వెంకటేశ్వర్లు, సీతారాం కుటుంబ సభ్యులను సీఎండీ పరామర్శించారు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.