Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుకిరువైపులా ట్రెంచ్‌లు
- చెక్‌పోస్ట్ పెట్టి తాళమేసిన వైనం
- పశువుల మేతకూ ఇక్కట్లు
- తాత్కాలిక దారులు ఉంచాలి : ఆదివాసీ గిరిజనులు
నవతెలంగాణ-మహాముత్తారం
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో అడవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రెంచ్(కందకాలు) వ్యవస్థను మూడేండ్ల కిందట ఏర్పాటు చేసింది. ఫారెస్ట్ భూముల హద్దులను గుర్తించి అధికారులు కందకాలు తవ్వించారు. ఆదివాసీ గిరిజనులను అడవికి దూరం చేయడం కోసమే ఈ ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుందని ఆరోపణలొస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి రేంజ్ పరిధిలో 7సెక్షన్లు, 27 బీట్లు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం 22,600 హెక్టార్లు కాగా, 12 గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఈ అటవీ ప్రాంతానికి అధికారులు హద్దులు విధించారు. పెగడపల్లి, కనుకునూర్ మధ్య 10 కి.మీ మొత్తం అటవీ ప్రాంతమే. ఈ ప్రాంతమంతా రోడ్డుకిరువైపులా కందకాలు తవ్వడంతో అడవిలోని తాత్కాలిక దారులు మూసుకుపోయాయి. అయితే గిరిజన, ఆదివాసీ రైతుల జీవితం అడవితోనే ప్రారంభమవుతుంది. వారి సంపద, నిత్యావసరం, ఎండు పుల్లలు, ఇప్పపువ్వు, బంక, తునికాకు సేకరణ, ఇతరాత్ర అవసరాలకు పొద్దున్నే లేసి అడవికి వెళ్తారు. పెగడపల్లిలో తాతముత్తాతల నుంచి పశువులను పోషించుకుటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఇంటికి 10 నుంచి 20 వరకు, కొంతమందికి 100 చొప్పున పశువులు ఉన్నాయి. ట్రెంచ్‌లు కొట్టడంతో అవి మేతకు అడవిలోకి పోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పోయినా కందకాలు దాటలేని పరిస్థితి, దాటే ప్రయత్నం చేసినా పశువులు అందులో పడి చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. వరి వేయవద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో రైతులు పొలాలను బీడులుగా వదిలేశారు. దాంతో పశువులకు పశుగ్రాసం లేక అల్లాడుతున్నాయి.
ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తీసి దారులు మూసుకుపోయి ఉన్న దారులను మళ్లీ మట్టి పోసి రెండు దారులుగా ఏర్పాటు చేశారు. వాటికి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు కూడా అడవిలోకి వెళ్లకుండా తాళం వేశారు. దాంతో అటవీ ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించిన శ్మశానవాటికనూ ఎవరూ వినియోగించుకోలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఓ వృద్ధురాలు చనిపోయింది. దహనసంస్కారాలు చేయాలంటే అడవికి వెళ్లాల్సిందే. చెక్ పోస్టుకు తాళం వేయడంతో నిరీక్షణతో మృదేహాన్ని చెక్‌పోస్టు కిందినుంచి తీసుకెళ్లారు. కనీసం మధ్య తరగతి కుటుంబీకులు అడవిలో ఉన్న వాగు నుంచి ఇసుక తీసుకొచ్చి మరుగుదొడ్డి నిర్మించుకోలేని పరిస్థితి నెలకొంది. ఓ రైతు 20 ఏండ్ల కిందట ఎకరంన్నర పోడుచేసి పంట పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భూమిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ కట్టాలని ఫారెస్టు అధికారులు యంత్రాలతో శుద్ధి చేశారు. ఇలా అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ, గిరిజనులపై పలు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చెక్ పోస్టులను తొలగించి సమస్యలను పరిష్కరించాలని గిరిజన, ఆదివాసీ రైతులు వేడుకుంటున్నారు.
నా భూమిని ఆక్రమించాలని చూస్తుండ్రు : అంగోత్ జోగానాయక్, పెగడపల్లి
2ఏ ఏండ్లు సాగులో ఉన్న భూమిని ఫారెస్ట్ అధికారులు లాక్కున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ కట్టాలని యంత్రాలతో చదును చేశారు. అలా చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏం అవ్వాలి. నాకు న్యాయం చేయాలి.
చెక్ పోస్టులు తీసేయాలి : బానోత్ సేవులానాయక్, పెగడపల్లి
నాకు 50 పశువులున్నాయి. అడవికి మేతకు వెళ్ళకుండా ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తీసి రెండూ దారులకు చెక్ పోస్టు ఏర్పాటు చేసి తాళం వేశారు. దాంతో అడవికి పశువులు తోలుకెళ్లే పరిస్థితి లేదు. మా గ్రామ పశువులు, మేకలు, గేదెలు అడవికి వెళ్లడానికి వీలుగా తాత్కాలిక రోడ్లు ఉంచాలి. రెండు దారులకు అమర్చిన చెక్‌పోస్టు తాళం తీసేస్తే సమస్య తలెత్తదు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.