Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో 14వేల మంది నమోదు
- సీజన్‌కు లక్ష్యం నిర్దేశించని ఉద్యానవనశాఖ
- అన్నదాతల ఎదురుచూపులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో ఉద్యానవన రైతులకు ఎప్పుడూ ఎదురుచూపులు తప్పడం లేదు. కొంత కాలం డ్రిప్ అందుబాటులో లేదు.. ఉన్నప్పుడు డీలర్లకు ధర గిట్టుబాటు కావడం లేదని వారు మొరాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ సీజన్‌కు టార్గెట్ నిర్ణయించలేదు. ఆన్లైన్ నమోదు చేసుకున్న వాళ్లకు క్రమపద్ధతిలో డ్రిప్ అందజేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఆన్లైన్ నమోదు చేసుకున్న దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించలేదు. మరో నెల రోజులు గడిస్తే సీజన్ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం డ్రిప్ లక్ష్యం నిర్ధేశించేది ఎప్పుడు.. దరఖాస్తుల పరిశీలన చేయడం.. రైతులకు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యానవన పంటలు సుమారు 1.30లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వాటిల్లో నల్లగొండ జిల్లాలో 65520 ఎకరాలు కాగా, సూర్యాపేట జిల్లాలో 45వేలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 20వేల ఎకరాల వరకు సాగవుతున్నాయి. ఐదారేండ్లుగా పండ్లతోటలను ఎక్కువ మంది రైతులు తొలగించారు. అందులో ప్రధానంగా బత్తాయి సాగును తీసేశారు. ఆశించిన మద్దతు ధర రాకపోవడం, కరోనా సమయంలో తీవ్రంగా పంట నష్టం రావడం వల్ల తొలగించారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఉద్యానవన పంటల్లో సగానికిపైగా పండ్లతోటలే ఉన్నాయి. కూరగాయల సాగులో సీజన్ బట్టి కొంత మార్పులు జరుగుతున్నాయి.
డ్రిప్ మంజూరులో రాయితీ ఇలా..
సాగునీటి వృథాను అరికట్టడంలో డ్రిప్ ప్రధాన భూమిక పోషిస్తుంది. డ్రిప్ మంజూరులో ప్రభుత్వం రైతులకు రాయితీ సౌకర్యం కల్పించింది. ఎస్సీ, ఎస్టీలకు 100శాతం రాయితీ, బీసీలకు 90శాతం, ఇతరులకు 5ఎకరాల్లోపు అయితే 90శాతం, అంతకంటే ఎక్కువగా ఉంటే 80శాతం రాయితీ సౌకర్యం కల్పించింది. ప్రతి రైతుకు ఐదున్నర హెక్టార్ల (హెక్టారుకు రెండున్నర ఎకరాలు) వరకు మాత్రమే రాయితీ అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకున్నారు. కూరగాయల సాగుకు కూడా డ్రిప్‌ను ఉపయోగిస్తున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రిప్ కోసం ఆన్లైన్లో మీ సేవా ద్వారా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తంగా 17,500హెక్టార్ల కోసం రైతుల నుంచి 14వేల దరఖాస్తులు నమోదయ్యాయి. అందులో నల్లగొండలో 13050హెక్టార్ల కోసం 9889 దరఖాస్తులు, సూర్యాపేటలో 2416హెక్టార్లకు 2050 మంది రైతులు, యాదాద్రి భువనగిరిలో 1996 హెక్టార్లకు 1502 మంది రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు ఇప్పటివరకు సంబంధిత కార్యాలయాలకు మాత్రం చేరలేదు. అధికారులు వాటిని పరిశీలన చేయలేదు.
ఏడాది కాలంగా పెండింగ్‌లో దరఖాస్తులు
2019-20లో డ్రిప్ మంజూరైంది. ఆ తర్వాత 2020-21లో డ్రిప్ ధర పెరగడంతో ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని కంపెనీలు రైతులకు సరఫరా చేయలేదు. దాంతో రైతులకు డ్రిప్ అందుబాటులోకి రాకుండా పోయింది. అయితే ఈ మధ్య కాలంలో డ్రిప్ ధరలను ప్రభుత్వం రెండింతలు చేసింది. కంపెనీలు కూడా రైతులకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఈ సీజన్ టార్గెట్ నిర్ణయించకపోవడం వల్ల మంజూరులో ఆలస్యం అవుతోంది. అందువల్ల ప్రభుత్వం స్పందించి వెంటనే లక్ష్య నిర్ధారణ చేసి డ్రిప్ మంజూరుకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
గతేడాది డ్రిప్ ధరలు పెరిగాయి
అన్నపూర్ణ- యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
గతేడాది డ్రిప్ ధరలు పెరిగాయని కంపెనీలు సరఫరా చేయలేదు. దాంతో రైతులకు ఇవ్వలేకపోయాం. ఈసారి అలాంటి పరిస్థితి లేదు. రైతులందరికి వచ్చే అవకాశం ఉంది.