Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు డైరెక్టర్లను నామమాత్రం చేసేలా కేంద్రం కుట్ర
- మే 4న దేశవ్యాప్తంగా రెండు గంటల సమ్మె
- ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌మిశ్రా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసీలో ఏకపక్షంగా వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదనీ, సంస్థ కార్యకలాపాలను చక్కదిద్దే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నామమాత్రం చేసే కుట్ర పన్నుతున్నదని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా విమర్శించారు. ఎల్ఐసీని ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మే నాలుగో తేదీన రెండు గంటల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్ఐసీ ఏర్పాటు, దాని ఎదుగుదలకు నిధులు సమకూర్చనప్పటికీ, చట్టం ద్వారా 1956లో ఏర్పడిన వెసులుబాటు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యాజమాన్య హక్కులను కలిగి ఉన్నదని గుర్తుచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నీ తానై ఎఐసీ ఐపీఓ వివరాలను, వచ్చే నెల నాలుగో తేదీ నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు సిద్ధమవుతున్న సమాచారాన్ని వెలువరించారని తెలిపారు. ఎల్ఐసీ విలువ 5.4 లక్షల కోట్ల రూపాయలుండగా దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను కేవలం ఆరు లక్షల కోట్లుగా ప్రకటిస్తూ మొదట్లో ఊహించిన ఒక్కో వాటా ధర రెండు వేల రూపాయలకు బదులు తొమ్మిది వందలు మాత్రమే ఉంటుందని ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు. వాటాల ఉపసంహరణకు ముందే తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు ఇంతలా దోచిపెట్టే యోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ముందు నుంచే ఏఐఐఈఏ హెచ్చరిస్తూ వస్తుందని తెలిపారు. ఏ సంస్థకైనా తన విలువను బట్టి వాటా రేటు ఉంటుందిగానీ, కొనుగోలుదారులు ఆశించిన మేరకు వాటా ధరను నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. కేవలం 21 వేల కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించాలనుకోవడం వంటి అంశాల వెనుక కేంద్ర ప్రభుత్వం అవసరం కోసం కాకుండా వాటాల ఉపసంహరణ అనే ప్రక్రియ జరగాలన్న మొండితనంతో ముందుకు వెళుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఎల్ఐసీ ఐపీఓ అనాలోచిత చర్య అని పేర్కొన్నారు.