Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా పోరాటాలతోనే
- ఎల్డీఎఫ్ నిర్మాణం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అభివృద్ధికి ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రజా పోరాటాలతోనే వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్య సంఘటనను నిర్మించాలని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృతస్థాయి ఆన్లైన్ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి అధ్యక్షతన జరిగింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఇటీవల కేరళలో జరిగిన ఆ పార్టీ అఖిల భారత మహాసభల్లో ఆమోదించిన రాజకీయ నిర్మాణ నివేదికను సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ వామపక్షాలు కేంద్రంగా పోరాటాల ద్వారా ఐక్య సంఘటనను నిర్మించాలని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై పోరాటాలు నిర్మించాలనీ, వామపక్షాలు, ప్రజాసంఘాలను భాగస్వాములను చేయాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక అంశాలపై కేంద్రీకరించి పనిచేయాలన్నారు. ఆర్థికరంగంతోపాటు సాంస్కృతికరంగంలోనూ కృషి చేయాలని వివరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టాలని చెప్పారు. పార్టీ శ్రేణుల ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. అప్పుడే ప్రజలను కదిలించి ఉద్యమాల్లో భాగస్వాములను చేసేందుకు వీలవుతుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానాలను, మతోన్మాద చర్యలను ఎండగట్టాలన్నారు. సోషల్ మీడియాను బలోపేతం చేయాలనీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వామపక్ష శక్తుల భావజాలాన్ని విస్తరింపచేయాలని కోరారు. మేడే దీక్షాదినమనీ, దాన్ని పట్టుదలగా ఉద్యమం పురోగమించడానికి పోరాటాలను స్మరించుకోవాలని సూచించారు. మేడే వేడుకలను జెండా ఎగరేయడం వరకే పరిమితం కాకుండా పండుగల చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, మతన్మాద చర్యలను వివరించాలని కోరారు.