Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో రెట్టింపైన వైనం
- జీహెచ్ఎంసీలోనే అధికం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. కరోనా నాలుగో వేవ్ వస్తుందా? రాదా? అనే దానిపై అనుమానులున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం రెండంకెల నుంచి ఒక అంకెకు పడిపోతాయనుకుంటున్న సమయంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడం గమనార్హం. ఇప్పటికే విదేశాల్లో, దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెరుగుదల, మరణాలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఈ పరిణామం చోటు చేసుకుంటున్నది. అయితే నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. చాలా జిల్లాల్లో ఇప్పటికీ జీరో కేసులు ఉండటం, కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు కేసులు మాత్రమే రావడం కొంత ఊరటనిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను మానుకోవడం తదితర జాగ్రత్తలను తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
49కి పెరిగిన కేసులు.....
ఈ నెల 21న రాష్ట్రంలో 17 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజాగా బుధవారం ఆ సంఖ్య 49కి ఎగబాకింది. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలో దాదాపు మూడింతలైంది. ఇప్పటికే విదేశాల్లో కేసుల పెరుగదలకు ఎక్స్ఈ వేరియంట్ రకం కారణమని నిపుణులు నిర్ధారించారు. రాష్ట్రంలో పెరుగుదలకు ఇప్పటికీ కచ్చితమైన కారణం తెలియక పోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 3,000కు పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో 1,000కి పైగా, హర్యానాలో 500కు పైగా కేసులు వస్తుండగా, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్టు తెలుస్తున్నది.