Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ పహారా మధ్య కేటీపీపీ
- కొనసాగుతున్న విచారణ
- మూడు రోజులుగా ఇద్దరు జెన్కో డైరెక్టర్ల మకాం
నవతెలంగాణ-గణపురం
కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన కాలిపోయిన చేతుమల్ల వీరస్వామి(32) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని బీ మిల్లర్ పేలి మంటలు వ్యాపించడంతో ఏడుగురు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదులోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వీరస్వామి వీరస్వామి 2017లో కేటీపీపీలో అర్టిజెన్గా చేరాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, మృతిచెందిన కార్మికునికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ధర్నాను అడ్డుకున్న పోలీసులు
వీరాస్వామి మృతితో కేటీపీపీ ఎదుట మతుని కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ధర్నా చేస్తారని ముందస్తు సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీపీపీని తమ అధీనంలోకి తీసుకొని ఎవరూ అటువైపు రాకుండా ట్రాక్టర్లు సైతం అడ్డుపెట్టి పహారా కాస్తున్నారు. దాంతో కేటీపీపీ ఉన్న చెల్పూర్ ప్రాంతంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొద లైంది. అదే సమయంలో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి వీరా స్వామి మృతదేహం కేటీపీపీకి చేరుకుంది. చెల్పూర్ పెట్రోల్ బంక్ సమీపం లో పోలీ సులు అంబులెన్స్‌ను ఆపి అడ్డుకున్నారు. కేటీపీపీ ముందు ధర్నా చేయవద్దని ఆంక్షలు విధించారు. తోటి కార్మికులు, మృతుని కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారు. దాంతో చెల్పూర్లో ఉద్రిక్తత ఏర్పడింది.
కొనసాగుతున్న విచారణ
కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, సిరి డైరెక్టర్ అజరు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. వీరస్వామి మృతితో విచారణకు వచ్చిన అధికారులకు కూడా కేటీపీపీలో ఏం జరుగుతుందోనని భయాందో ళనలో ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ధర్నాలు చేయకుండా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
కేటీపీపీ మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
కేటీపీపీ స్టేజ్ 1 బాయిలర్ మిల్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో విధులు నిర్వహిస్తూ గాయపడి, హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టిజన్ కేతమల్లు వీరాస్వామి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, తక్షణ కారుణ్య నియామకం ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ ఎన్ శ్రీధర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.