Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవో అప్పీళ్లు, భార్యాభర్తలు, పరస్పర బదిలీలు పరిష్కరించాలి
- గురుకులాల్లో వేసవి శిబిరాలు, అడ్వాన్స్ తరగతులు రద్దు చేయాలి:
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలనీ, వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం సజావుగా సాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వర్చువల్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎ నర్సిరెడ్డి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించటాన్ని, 'మనఊరు-మనబడి' కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందే బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం కార్మికులను నియమించాలని కోరారు.
టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ 317 జీవో ప్రకారం ఉద్యోగుల కేటాయింపులో అన్యాయం జరిగిందనీ, అప్పీల్ చేసుకున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భార్యాభర్తల బదిలీలు, పరస్పర బదిలీల దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కారం చేయాలని కోరారు. అప్పీళ్లను అనుమతించటం లేదా తిరస్కరించటం చేయకుండా వారు ఎంత కాలం ఎదురుచూడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బదిలీలు, పదోన్నతులకు ముందుగానే 317 జీవో అప్పీళ్లన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో అయినా బదిలీలు, పదోన్నతులు చేస్తారా లేదా అనే అనుమానాలు ఉపాధ్యాయుల్లో ఉన్నాయని చెప్పారు. వచ్చేనెల మొదటి వారంలోగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకుంటే ఇతర సంఘాలతో సంప్రదించి రెండో వారం నుంచి షెడ్యూల్ ప్రకటించేవరకు ఐక్య పోరాట కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానించిందని వివరించారు. వేసవిలో పదో తరగతి మినహా ఇతర తరగతులు నిర్వహించటానికి వీల్లేదని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను గురుకుల విద్యాసంస్థలు బేఖాతర్ చేయటాన్ని ఖండించారు. వేసవి శిబిరాలు, అడ్వాన్స్ తరగతుల పేరుతో విద్యార్థులను, ఉపాధ్యాయులను వేసవి సెలవుల్లో ఇబ్బంది పెట్టడం మానుకోవాలని కోరారు. ఆవాస పద్ధతిలో పని దినాల్లో తీవ్రమైన పనిభారంతో కుటుంబాలకు దూరమౌతున్న ఉపాధ్యాయులను కనీసం వేసవి సెలవుల్లోనైనా ప్రశాంతంగా గడిపేలా అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. వేసవిలో ఎస్సెస్సీ, ఇంటర్ తదితర పరీక్షల విధులకు కేటాయించిన ఉపాధ్యాయులకు అర్హత గలిగిన సంపాదిత సెలవును ప్రిజర్వ్ చేయాలని కోరారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో సైతం సీపీఎస్‌ను రద్దు చేయాలనీ, దేశవ్యాప్తంగా సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. వచ్చేనెల 20,21,22 తేదీల్లో విజయవాడలో జరుగుతున్న ఎస్టీఎఫ్ఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సమావేశం పిలుపు నిచ్చింది. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని, సిహెచ్ రాములు, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.