Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజుల్లో దేశ, విదేశాల్లో చర్చలు జరుపుతాం : కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అవసరమైన సమయంలో జాతీయ రాజకీయాలపై ముందుకెళ్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 15 రోజుల్లో దేశ, విదేశాల్లో ఉన్న ప్రముఖులతో చర్చలు జరుపుతామనీ, త్వరలోనే హైదరాబాద్‌లో ఐఏఎస్, రిటైర్డ్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. 'మోడీ దేశం కోసం ఏం చేశారు? ఇక ఆయన ఆటలు సాగనియ్యం. కేంద్రం పన్నులు పెంచితే రాష్ట్రాలు తగ్గించాలా? ఇదేం న్యాయం?మేం రూపాయి ట్యాక్స్ కూడా పెంచలేదు. అలాంటప్పుడు ఎందుకు తగ్గిస్తాం?' అని ప్రశ్నించారు. ప్రధాని కుర్చీ తమ లక్ష్యం కాదన్నారు. చైనా కంటే ఇండియా పాలసీ బెటర్‌గా ఉంటె ఎందుకు అభివృద్ధి సాధ్యం కాదని ప్రశ్నించారు. మనస్సుపెట్టి పని చేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా ఇండియా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి కొత్త ఎజెండాను తయారు చేయడానికి తానే ఒక సైనికున్ని అవుతానని చెప్పారు. తమ పార్టీకి ఫండ్ సమస్యే కాదనీ, 60 లక్షల పార్టీ సభ్యులు తలా వెయ్యి రూపాయలిచ్చినా రూ.600 కోట్లు అవుతుందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 90కిపైగా స్థానాలు రాబోతున్నాయని సర్వేల్లో తేలిందన్నారు. త్వరలోనే తమ పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు పెడతామనీ, పార్టీ ప్రతినిధుల విదేశాల టూర్ కూడా ఉంటుందని చెప్పారు. తమ పార్టీకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.865 కోట్లు ఉన్నాయనీ, తమ పార్టీకి రెండు ఇన్నోవా కార్లు, ఒక ఫోర్ట్ వాహనం ఉందని తెలిపారు. ఆయనకు ప్రజలపై ప్రేముంటే సెస్‌లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఆయన మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను అమ్మితే వెయ్యి కోట్ల రూపాయల బహుమతి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా? అని ప్రశ్నించారు. నాగరిక సమాజంలో కత్తులు పట్టుకోని రోడ్ల పై తిరుగడమేంటని నిలదీశారు. బీజేపీ దుర్మార్గాలను ఎండగట్టాలనీ, దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.