Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీపీఎస్ ప్రమాదంలో మరణించిన వీరాస్వామి కుటుంబానికి రూ. కోటి పరిహారమివ్వాలి
- టీఎస్‌యూఈఈయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాకతీయ విద్యుత్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) లో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆర్టిజన్ కేతమల్లు వీరస్వామి చనిపోయారనీ, అతని కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని టీఎస్‌యూఈఈయూ(సీఐటీయూ) రాష్ట్ర గౌరవఅధ్యక్ష, కార్యదర్శులు భూపాల్, అధ్యక్షులు ఎన్.స్వామి వి గోవర్థన్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యుత్ పవర్ ప్లాంట్లలో వరసగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల అనేక మంది కార్మికులు మృత్యువాతపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 25న కాకతీయ పవర్‌ప్లాంట్‌లో మిల్లర్ పేలటంతో ఆరుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఆ క్రమంలో కేతమల్లు వీరస్వామి హైదరాబాద్ యశోదలో చికిత్సపొందుతూ చనిపోయారని తెలిపారు. గతంలో శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో కూడా అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది మంది ఉద్యోగులు అక్కడికక్కడే చనిపోయారని గుర్తుచేశారు. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో కూడా ప్రమాదాల బారిన పడి ఉద్యోగులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ట్రాన్స్‌కో యజమాన్యం తక్షణం స్పందించి చికిత్స పొందుతున్న ఉద్యోగులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేటీపీపీలో ప్రమాదానికి గల కారణాలను విచారించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.