Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రద్దు చేసిన రేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ డిమాండ్ చేసింది. కొత్త దరఖాస్తులను స్వీకరించాలనీ, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో బోగస్ కార్డుల ఏరివేత పేరుతో తొలగించిన లక్షలాది రేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. తొలగించే ముందు లబ్దిదారునికి సమాచారమివ్వకపోవడం, రేషన్ కార్డు పొందే ప్రాథమిక హక్కును కాలరాసే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని గుర్తుచేశారు. రేషన్ కార్డుల తొలగింపుపై తమ పార్టీ గతంలో ఆందోళన నిర్వహించిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష, మొండివైఖరితో లక్షలాది మంది పేదలు కనీసం రేషన్ పొందే అర్హత కోల్పోయారని విమర్శించారు.
అర్హులందరికి న్యాయం జరగలేదు...
కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని 2016లో దరఖాస్తులు స్వీకరించి ఇటీవల కొంత మందికి పంపిణీ చేసినప్పటికీ అర్హులందరికీ న్యాయం జరగలేదని తెలిపారు.
ఇప్పటికీ రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేదలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించలేదనీ, హైదరాబాద్ నగరంలోనే కొత్తగా పెండ్లైన జంటలు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారని చెప్పారు.