Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్
నవతెలంగాణ-తాండూరు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.24 లక్షల విలువైన 12 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రవాణా చేస్తున్న అజరు సుభాష్ను అరెస్ట్ చేసినట్టు ఏసీపీ తెలిపారు. గురువారం బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ తాండూరు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. జనకపూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా బొలెరో వాహనం కొద్ది దూరంలో నిలిపి డ్రైవర్ పారిపోయాడని తెలిపారు. ఆ వాహనంలో 50 కిలోల బరువున్న 22 నకిలీ పత్తి విత్తనాల సంచులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మంచిర్యాలకు చెందిన పులికొండ యశ్వంత్ వెంకటకృష్ణ కుమార్ గన్నీ సంచుల వ్యాపారం చేస్తుండేవాడని, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే వెంకటకష్ణ డ్రైవర్లు అజరు, సుభాష్ కర్నాటకలోని సింగనూర్ వెళ్లి 12 క్వింటాళ్ల గ్లైఫోసెట్ విత్తనాలను బొలెరో వాహనంలో మంచిర్యాలకు తీసుకొచ్చారన్నారు. అక్కడి నుంచి కన్నెపల్లికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఈ అక్రమ దందాలో ప్రమేయం ఉన్న మరింత మంది కోసం విచారణ చేపడుతున్నట్టు ఏసీపీ తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, వాటి బారిన రైతులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన తాండూర్ సీఐ జగదీశ్, కన్నెపల్లి ఎస్ఐ సురేశ్వర్మను ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో తాండూర్ ఎస్ఐ కిరణ్కుమార్, మాదారం ఎస్ఐ సమ్మయ్య, భీమిని ఎస్ఐ వెంకటేష్, సిబ్బంది తులసీరామ్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.