Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి
- మంత్రి సబితకు టిగ్లా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్ష నిర్వహణ కోసం జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ (డీఈసీ)లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం జంగయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటి వరకు అధికారికంగా అది ఏర్పాటు చేయకపోవడం వల్ల జిల్లాల్లో జరిగే కస్టోడియనన్లు, సీఎస్, డీవోల సమావేశాలను అనధికారిక వ్యక్తులతో నిర్వహిస్తున్నారని తెలిపారు. దానివల్ల అవకతవకలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు. సీఎస్, డీవోల సమావేశానికి ముందే డీఈసీలను ఏర్పాటు చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణ విధుల కేటాయింపులో సీనియర్లకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అసంపూర్తి డీఈసీతో పరీక్షలు నిర్వహించిన రంగారెడ్డి డీఐఈవోపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరారు. వార్షిక పరీక్షల అనంతరం ఉద్యోగులకు తప్పకుండా బదిలీలు చేపడతామంటూ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిగ్లా నాయకులు లక్ష్మయ్య, సైదులు, మంజు నాయక్, పరశురాములు, ముడి శేఖర్, స్వప్ప తదితరులు పాల్గొన్నారు.