Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గిరిజన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అందుకనుగుణంగా 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, అయినా ఇప్పటివరకు ప్రక్రియను ప్రారంభించలేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా విద్య, ఉద్యోగాల్లో గిరిజనులు అణిచివేతకు గురవుతున్నారని చెప్పారు. అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి పోడు భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పించకపోతే ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల జీవితాలతో ఆటలాడకుండా వారికి వెంటనే 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.