Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : తమ శాఖకు చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ను దుర్భాషలాడిన అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డీజీపీని కోరింది. ఇటీవలన తాండూరులోని ఒక కార్యక్రమంలో తాండూరు ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ మహేందర్ దుర్భాషలాడటం కలకలం రేపింది. దీనిపై స్పందించిన రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మహేందర్ రెడ్డి చర్యలను ఖండించింది. వెంటనే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేసింది. కొందరు రాజకీయ నాయకులు విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను నిందించటం, దుర్భాషలాడటం గత కొంత కాలంగా సాగుతున్నదనీ, ఇది మంచి విధానం కాదని సంఘం తెలిపింది. శాంతి, భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసు అధికారులు, సిబ్బందిని ఎవరూ నిందించినా, దురుసుగా వ్యవహరించినా అది వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందనేది మరవరాదన్నది. ఎవరి పట్లనైనా పక్షపాతంతో వ్యవహరించాల్సినవసరం పోలీసులకు లేదనీ, చట్టరీత్యా వ్యవహరించటమే వారికి తెలుసని సంఘం స్పష్టం చేసింది.