Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ ముందు బక్క జడ్సన్ ధర్నా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనీ, వీఆర్వో లను క్రమబద్ధీకరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీసీఎల్ ఏ కార్యాలయం వద్ద ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ వీఆర్వోలకు పేస్కేల ఇస్తామంటూ ప్రభుత్వం ఐదేండ్ల క్రితం వాగ్దానం చేసిందనీ, ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. సర్వీస్ క్రమబద్ధీకరణ చేయకుండా చెరువులు, కుంటల పర్యవేక్షణ ఉద్యోగాలు వీఆర్వోలకు ఇస్తామనడం సరైందికాదని చెప్పారు. రెండేడ్లుగా జాబ్‌చార్ట్ లేకుండా ట్రెజరీ నుంచి జీతాలు ఎట్లా ఇస్తున్నారని ప్రశ్నించారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.2016 అక్టోబర్ నుంచి ప్రమోషన్లు లేవన్నారు.పేదలు, ఎస్సీ,ఎస్టీల భూములను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏకు శాశ్వత కమిషనర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ, అడిషన్ సెక్రటరీ వంటి పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో కీలకమైన రెవెన్యూ విధులను నిర్వహించడానికి వ్యవసాయ క్లస్టర్ల మాదిరిగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ కుర్మా, దుగ్యల వేణు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వచ్చాక బాల్క సుమన్‌పై విచారణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరిక
తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ కొంత మంది విద్యార్థులను చంపినట్టు ఆరోపణలున్నాయనీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ యువ నేతలు మానవతారారు, వెంకట్, కేతురి వెంకటేష్ ,విజరు, చెనగాని దయాకర్, బాలలక్ష్మి, చందనారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటన అనుమతిపై ఇప్పటి వరకు రిజిస్ట్రార్ స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలకు కూడా అనుమతి ఇవ్వరా? అని ప్రశ్నించారు. అనుమతి ఇస్తే సంతోషమనీ, ఇవ్వకపోతే ఏం చేయాలో తమకు తెలుసనని హెచ్చరించారు.ఇలాంటి అంశంపై త్వరలో విద్యార్ధి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.