Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రం మత సామరస్యానికి చిహ్నంగా, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచిందని శాసనమండలి సభ్యులు రాజేశ్వర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్వమత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత అందమైన, విశాలమైన చర్చి నిర్మాణాలు లేవని కొనియాడారు. ఈ నిర్మాణం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో పునర్నిర్మాణానికి మెదక్ డయెసిస్ బిషప్ రెవరెండ్ డా.ఎ.సి.సాలమన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు శంఖుస్థాపన చేశారు. బిషప్ సాలమన్ ప్రత్యేక ప్రార్థనలతో నూతన చర్చి నిర్మాణ పనులు ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్న దష్ట్యా శంఖుస్థాపన కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ లో రూ. 1.5 కోట్లతో నిర్మిస్తున్న చర్చి కోసం 500 గజాల స్థలం కేటాయించింది. ప్రభుత్వ ఖర్చుతో విశాలమైన ప్రదేశంలో ప్రార్థనా మందిరాన్ని అందంగా పునర్ నిర్మిస్తున్నందుకు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బిషప్ రెవరెండ్ ఎ.సి. సాల్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లౌకికవాదాన్ని కాపాడుతూ, అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నారని గుర్తు చేశారు. చర్చి స్థలము, నిర్మాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఆర్ అండ్ బీ ఎస్.ఈ. సత్యనారాయణ చర్చి డిజైన్లను ఉద్యోగులకు చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డింగ్స్) సుద్దాల సుధాకర్ తేజ, ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన ప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, ఉద్యోగులు చిట్టిబాబు, బి.జేకబ్ రాస్, జేమ్స్, సునీత, సుష్మ, సౌజన్య, రాజు, రత్నం, మణి, శాస్త్రి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.