Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ ధరలెందుకు పెంచారు?
- బీజేపీకి కేటీఆర్ సూటిప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్రూడాయిల్ ధర పెరగకున్నా పెట్రోల్ ధరలెందుకు పెంచారని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు కేంద్రంలోని బీజేపీ సర్కారును ప్రశ్నించారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రో ధరల పెంపుపై చేసిన ట్వీట్లకు మంత్రి స్పందించారు. 2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే ధరకి క్రూడాయిల్ దొరుకుతున్నప్పుడు పెట్రోల్ ధర 120 రూపాయలకు పైగా ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెట్రో ఉత్పత్తుల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ పన్ను పెంచలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రో పన్నులను పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని తెలిపారు. ఈ పెరుగుదలకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు కారణం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే రూ.70, రూ.60కే డీజిల్ ప్రజలకు అందించే వీలుందని తెలిపారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే ముందు పూరి ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చెబితే మంచిదని హితవు పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 26 లక్షల కోట్లను సెస్సుల రూపంలో ప్రజల నుంచి గుంజింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.