Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సినీ నిర్మాతల కోరికమేరకు సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరైంది కాదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) విమర్శించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తాను ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు సిల్వేరు రాజు, కృష్ణనాయక్, నాయకులు శ్రీను, శ్రీకాంత్ గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దసినిమాల విడుదల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి టికెట్ ధరలను పెంచడం సినీ ప్రేక్షకులు, సామాన్య ప్రజలకు మరింత భారం అవుతున్నదని విమర్శించారు.
ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న సామాన్యులపై నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇతర రకరకాల ధరల భారంతో సతమతమవుతున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకునేందుకు టికెట్ ధరల పెంపు నిర్ణయం సరైంది కాదని తెలిపారు. దాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని సూచించారు. కానీ ఆ భారాన్ని ప్రజలపై మోపడం సరైంది కాదని పేర్కొన్నారు. సామాన్యులను వినోదానికి దూరం చేయడమే అవుతుందని తెలిపారు. సినిమా థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.