Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు జాక్టో వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే విద్యాసంవత్సరంలో బడులు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో జాక్టో చైర్మెన్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని రకాల బదిలీలు, పదోన్నతులు చేపట్టి పారదర్శకతతో నిర్వహించాలనీ, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ఒక్క ఉపాధ్యాయుడికి కూడా అన్యాయం జరగకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అన్ని కేటగిరీల బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలనీ, దీంతోపాటు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని సూచించారు. కేజీబీవీల్లో బదిలీలు తక్షణం చేపడుతూ షెడ్యూల్ ప్రకటించాలని తెలిపారు. 317 జీవో అమల్లో భాగంగా అపరిష్కృత అప్పీళ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరస్పర బదిలీలు పూర్తి చేయాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పరస్పర బదిలీలపై జీఏడీ అభిప్రాయం కోసం లేఖ పంపామనీ, అది రాగానే ప్రక్రియ చేపడతామంటూ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భాషాపండితులు, ఎస్జీటీల మధ్య వివాదం సద్దుమణిగిన తర్వాత పదోన్నతులు ఇస్తామన్నారని పేర్కొన్నారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామనీ, అన్ని విషయాలనూ పరిశీలించిన తర్వాత పదోన్నతులు, బదిలీలు చేపడతామన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు బి భుజంగరావు, నాయకులు పోల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహ్మారెడ్డి, ప్రేమ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వీర రాఘవులు, లక్ష్మినారాయణ, టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి కె సారయ్య, నాయకులు గడ్డం మాధవరెడ్డి, బీసీటీఏ అధ్యక్షులు కె కృష్ణుడు, ఎస్సీ,ఎస్టీయూఎస్ అధ్యక్షులు కె వెంకటి, విఠల్ (ఎంటీయూ) పాల్గొన్నారు.