Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండలో పార్టీ బలంగా ఉంది
- ఎవ్వరూ రావాల్సిన పనిలేదు
- భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయాలి
- సోనియా, రాహుల్‌గాంధీకి లేఖ రాస్తా
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి తాను హాజరుకావడంలేదని స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం వల్ల పార్టీ సమావేశానికి వెళ్లడం లేదని తెలిపారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందనీ, వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తననివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర సమావేశాలు పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. పీకే గీకే కాదు...కేసీఆర్‌ను ఎలా పీకాలనే దానిపైన్నే ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తివేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని రాష్ట్రం ఏం అభివృద్ధి చేశారనీ, దేశం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పొత్తు అడిగినా, ఏఐసీసీ అధిష్టానం ఒప్పుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చే అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కష్టమైనా, నష్టమైనా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించాలని కోరారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసేందుకు విక్రమార్కకు అనుమతి ఇవ్వాలంటూ సోనియా, రాహుల్‌గాంధీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఆయన పాదయాత్ర చేస్తే కావాల్సిన సహకారమందిస్తామన్నారు. 'కాంగ్రెస్‌లో నేను అనే పదానికి చోటు లేదు. మనం అని మాత్రమే అనాలి' అని చెప్పారు. రాహుల్ సభకు ఒక వ్యక్తి మాత్రమే లక్షల మందిని ఎలా తీసుకొస్తారని పరోక్షంగా రేవంత్‌ను ప్రశ్నించారు. పట్నం మహేందర్‌రెడ్డికి టీఆర్ఎస్లో అవమానం జరిగిందనీ, ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ అనీ, ఆ పద్దతిలో పోలీసులు వ్యవహరించడం లేదన్నారు.