Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు
- తార్నాక ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిలో నూతనంగా నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. నూతన కాలేజీ నిర్మాణానికి గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కలిసి శంకుస్థాపన చేశారు. అప్పటివరకు ఆస్పత్రి ఆవరణలోని ఓ భవనంలో తాత్కాలికంగా కాలేజీని నిర్వహించనున్నారు. అలాగే ఆస్పత్రిలో 20 పడకల ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంబులెన్స్‌లు, క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆస్పత్రిలో అత్యాధునిక వసతుల ఏర్పాటుతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సెస్‌ల పేరుతో, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం రాష్ట్రాలపై భారాలు మోపుతున్నా వాటిని అధిగమిస్తూ ఆర్టీసీని కాపాడుకుంటున్నామని చెప్పారు. ఆ ఏడాది నుంచి నర్సింగ్ కోర్సు నిర్వహణకు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనుమతి ఇచ్చిందనీ, మొత్తం 50 సీట్లు ఉన్నాయనీ, వాటిలో 5 సీట్లు టీఎస్ ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు కేటాయించనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదికి అడ్మిషన్స్ సంఖ్య వందకు పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే, వొకేషనల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న నవరత్న కంపెనీలను కేంద్రం అమ్ముతున్నా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొత్తగా వెయ్యి బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నామని, ఎలక్ట్రిక్ బస్సులు కొనడం ద్వారా డీజిల్ భారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ సొసైటీని పునరుద్ధరిస్తామన్నారు.
చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. తార్నాక ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రయాణికుల ద్వారా ఆదాయమేగాక, ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయం రావడంపై పరిశీలిస్తామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగులు 6 నెలలుగా సమ్మె చేస్తున్నారని, దేశవ్యాప్తంగా ఆర్టీసీ పరిస్థితి బాగాలేదని, తెలంగాణలో మాత్రం కొంత మెరుగ్గా ఉందని వెల్లడించారు. గత ఆరు నెలలుగా ఆర్టీసీ కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ బాగుంటుందనే నిర్ణయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ ఆస్పత్రిని ఆర్టీసీ బ్రాండ్ పెంచే విధంగా అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రగతిచక్రం అవార్డులను మంత్రి పువ్వాడ ప్రదానం చేశారు.