Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భం దాల్చడంతో వెలుగులోకి..
- ఫిర్యాదు చేసిన ఐద్వా
- మరో ఘటనలో ఐదేండ్ల బాలికపై..
నవతెలంగాణ-కంఠేశ్వర్
మతిస్థిమితం లేని యువతిపై ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు, బాధితురాలి పెద్దనాన్న సైతం లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌నగర్ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. మతిస్థిమితం లేని యువతి (22) కాలనీలోని తన పెద్దమ్మ మల్లపూర్తి రామవ్వ వద్ద ఉంటోంది. అయితే ఆ యువతి వద్దకు కొన్ని రోజులుగా ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. అలాగే బుధవారం రాత్రి 11గంటల సమయంలో యువతి పెద్దనాన్న మల్లాపూర్తి పెద్ద గంగారం సైతం లైంగిక దాడికి పాల్పడుతుండగా స్థానికులు గమనించారు. దానికి రామవ్వ పూర్తిగా సహకరించినట్టు కాలనీవాసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత.. కాలనీ వాసులతో పాటు, స్థానిక కార్పొరేటర్ భర్త వినోద్‌కుమార్‌తో కలిసి నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతం చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫిర్యాదు చేసిన అనంతరం లత మాట్లాడుతూ.. 'రక్షించాల్సిన పోలీసులే.. తప్పుచేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్‌ను వెంటనే సస్పెండ్ చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏఆర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీచేశారు.
ఐదేండ్ల బాలికపై లైంగికదాడి..
ఐదేండ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్‌స్టేషన్ పరిధి కోటగల్లి ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుజూసింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఐదేండ్ల బాలికపై 15 ఏండ్ల మైనర్ బాలుడు మంగళవారం లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు అదేరోజు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని మైనర్ కావడంతో ఫోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలుడిని కోర్టులో హాజరుపరచగా మైనర్ కావడంతో జువైనల్ హౌంకు తరలించాలని కోర్టు తీర్పునిచ్చినట్టు తెలిసింది.