Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ప్రశ్నించిన సీఎం కేసీఆర్
- నల్లగొండ పర్యటనలో నుడా అభివద్ధిపై సమీక్షా సమావేశం
- ఎమ్మెల్యే లింగయ్య కుటుంబ సభ్యులకు పరామర్శ
- మంత్రితో కలిసి సహపంక్తి భోజనాలు
- నార్కట్ పల్లి, నకిరేకల్ అభివృద్ధిపై నోరెత్తని కేసీఆర్
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
నల్లగొండ పట్టణాభివృద్ధి, సాగర్ అభివృద్ధికి నిధులు మంజూరైనా పనుల్లో ఇంకా జాప్యమెందుకు చేస్తున్నారనీ, వెంటనే పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ సంతాపసభకు సీఎం హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం
నల్లగొండ పట్టణాభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
నుడా అభివద్ధిపై సీఎం సమీక్ష
నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం నార్కట్‌పల్లిలో నల్గొండ కమిషనర్ రమణాచారి తదితరులతో కలసి నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. ఫొటోలు నివేదికల ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు. నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు పనుల పురోగతిపై సీఎంకు వివరించారు. నల్లగొండ టౌన్లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో 'నల్లగొండ కళాభారతి' సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలన్నారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకు వివరించారు.
అదే సమయంలో నాగార్జున సాగర్ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్‌తో పాటు ఆలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్‌ను సీఎం అడిగారు. వీటికి సంబంధించిన నిధులు మంజూరై చాలా రోజులయ్యాయనీ, పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. మిర్యాలగూడలో కోర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. సమీక్షా సమావేశంతో పాటు సంతాప సభలో సీఎం వెంట మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందాడి సైది రెడ్డి తదితరులు ఉన్నారు.