Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో ఉపాధ్యాయులపై నిర్బంధాన్ని ఖండిస్తున్నాం
- తెలుగు రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేయాలి
- ఎస్టీఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యలో అంతరాలను పెంచుతూ, రాష్ట్రాల హక్కులను హరిస్తూ, ప్రజల ఐక్యతకు భంగం కలిగించే కేంద్రీకరణ, ప్రయివేటీకరణ, కాషాయీకరణలను ప్రోత్సహించే జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం నిర్వహించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) నిర్ణయించింది. ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సమావేశం ఢిల్లీ షాదీపూర్‌లోని టీచర్స్ భవన్ (ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యాలయం)లో అభిజిత్ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. ఎస్టీఎఫ్ఐ ఎనిమిదో జాతీయ మహాసభలు మే 20,21,22 తేదీల్లో విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. సీపీఎస్ రద్దు, జాతీయ విద్యావిధానం రద్దు ప్రధానాంశాలుగా మహాసభల్లో చర్చించనున్నారు.
అనంతరం ఏపీయూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కెఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేండ్లైనా దాని గురించి మాట్లాడకపోవటం సమంజసం కాదని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్న ఏపీ పోలీసుల నిర్బంధకాండను తీవ్రంగా ఖండించారు. ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయకుండా జీపీఎస్ అనే కొత పథకాన్ని ప్రతిపాదించటం సమంజసం కాదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
చావ రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు చేయాలనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పథకాన్ని రాష్ట్రంలో రద్దు చేసి ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అమలు జరపబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మనఊరు-మనబడి పథకాన్ని, సమాంతర ఇంగ్లీషు మీడియంను సమర్థవంతంగా అమలు చేయాలంటే 21,500 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, విద్యాశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం లేదన్నారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎన్ఈపీని వ్యతిరేకించాలి : బి. వెంకట్
విద్యా ప్రయివేటీకరణ, కాషాయికరణ అయితే ఉత్పత్తి వర్గాలకు విద్య అందని ద్రాక్షలా ఉంటుందని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. ఏపిలో సీపీఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారనీ, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడుగుతుంటే ఉపాధ్యాయులపై నిర్బంధం విధించడం సమంజసం కాదన్నారు. అది విద్యపైనా ప్రభావం చూపుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు.