Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణాంతకమవుతున్న వైనం
- ఆయోమయంలో వినియోగదారులు
- స్వల్పంగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాలు
- దేశవ్యాప్తంగా 162.97 శాతం కొనుగోళ్లు
- పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలే మూలం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పెట్రోలియం వాహనాలను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రజానీకం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలు, వినియోగం వైపు దృష్టిసారిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో స్వల్పంగా ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్ల శాతం అధికమవుతున్నది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటం, చమురు వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు వినియోగదారులు మళ్లుతున్నారు. కాగా, గత రెండేండ్లుగా ఈ సంఖ్య దేశవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్నా, రాష్ట్రంలో మాత్రం నామమాత్రంగా ఉండటం గమనార్హం. 2021లోనే దేశవ్యాప్తంగా 32,4840 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైతే, రాష్ట్రంలో 4,456 ఈవీలను మాత్రమే వినియోగదారులు తీసుకున్నట్టు కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ ఉన్నతాధికారుల సమాచారం. అంతకుముందు ఏడాది 2020లో రాష్ట్రంలో కేవలం 847 ఈవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019లో 1037 ఈవీలు కోనుగోలు జరిగినట్టు సమాచారం. ఇప్పటివకు రాష్ట్రవ్యాప్తంగా 6340 ఈవీలు ఉండగా, దేశవ్యాప్తంగా 6,13,220 ఎలక్ట్రిక్ వాహనాలు వాడకంలోకి వచ్చాయి. 2020లో 25.07శాతం ఈవీల కొనుగోలు ఉంటే, 2021కి వచ్చేసరికి 162.97 శాతం పెరిగిందని సమాచారం. ఇప్పుడిప్పుడే ప్రజానీకం ఈవీలవైపు దృష్టిపెడుతున్నారనీ, ఈ సంఖ్య రానున్న మూడేండ్లల్లో భారీస్థాయిలో పెరిగే అవశాశాలు విస్త్రృతంగా ఉన్నాయని అధికారిక సమాచారం.
ఈవీల సబ్సీడికి రూ.18 వేల కోట్లు
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రొత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లను కేటాయించింది. ఐదేండ్ల కాలానికిగాను సబ్సిడీలు ఇచ్చేందుకు ఈ నిధులు ఖర్చుచేయనున్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం కింద ఈ నిధులను దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించేందుకుగాను వినియోగిస్తామని చెబుతున్నారు. వీటితోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తు, మానవ రవాణాకు ఈవీలు, బ్యాటరీతో నడిచే వాహనాలను ప్రొత్సహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం విదితమే.
ఆయోమయం..ఆందోళన
ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం చురుగ్గా చర్యలు చేపట్టింది. పన్నులు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజులను పూర్తిగా ఎత్తేసింది. ఈవీల కోనుగోళ్లుపెరిగే అవకాశాలున్న తరుణంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సంఘ టనలు వినియోగదారులను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నాయి. నిజామాబాద్లో ఈవీ ఛార్జింగ్ నడు స్తుండగా 80 ఏండ్ల వృద్ధుడు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పుణే, విజయవాడల్లోనూ మరో ఇద్దరు చని పోయారు. ముంబయి, ఢిల్లీ నగరాల్లోనూ ప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్ల విషయంలో ఒకింత ఆలోచించే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 138 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 600 కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. జాతీయ రహదారులు, స్టేట్ హైవేల వెంబడి, అలాగే విద్యుత్ సబ్స్టేషన్ల సమీప ప్రాంతాల్లోనూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. పక్కా, పటిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసేలా చర్యలు తీసుకుంటామని వారం రోజుల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.