Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులు దాన్ని కోరుకుంటున్నారన్నది సరికాదు
- ప్రత్యామ్నాయ ఎజెండా అంటే నయాఉదారవాద విధానాలనూ వ్యతిరేకించాలి
- రాష్ట్రాలపై మోడీ సర్కారు దాడి
- పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రమే తగ్గించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన విధానాల గురించి మాట్లాడుతూ బీజేపీపైన విమర్శలు ఎక్కుపెట్టడం సంతోషకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీ ఈ దేశానికి నష్టం చేస్తున్నదనీ, దాని పరిపాలన బాగాలేదనీ, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన శ్రద్ధ చూపడం లేదంటూ చెప్పడం సరైందేనని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తమ్మినేని ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఫ్రంట్ల విషయంలో కేసీఆర్ భిన్నమైనట్టు, కమ్యూనిస్టులు ఫ్రంట్లు కావాలని కోరితే అట్లా కాదనీ, ప్రత్యామ్నాయ ఎజెండా కోసం తానే సలహా ఇచ్చానని చెప్పడం అబద్ధమని విమర్శించారు. ఇటీవలి కాలంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అని మాట్లాడింది కేసీఆరేనని గుర్తు చేశారు. దానికి భిన్నంగా దేశ స్థాయిలో ఎన్నికలకు ముందు ఫ్రంట్ల వల్ల ఉపయోగం లేదనీ, వాటి ఏర్పాటుకు వ్యతిరేకమని సీపీఐ(ఎం) పదే పదే చెప్తున్నదని వివరించారు. కానీ దానికి పూర్తి తల్లకిందులుగా ఫ్రంట్ల కోసం కమ్యూనిస్టులు ఆరాట పడుతున్నట్టు, దానికి ఆయన వ్యతిరేకమని చెప్పడంతోపాటు ప్రత్యామ్నాయ ఎజెండా కోసం మాట్లాడుతున్నానని చెప్పడం సరైంది కాదని తెలిపారు. ఇది ఆయన టెంపరితనానికి నిదర్శనమనీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఎజెండా అంటే మతోన్మాదాన్ని వ్యతిరేకించడం, మతపిచ్చిగాళ్లను విమర్శించడం మంచిదేనని తెలిపారు. కానీ కేసీఆర్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల మాటేమిటని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలోనూ నయా ఉదారవాద విధానాలే అమలవుతున్నాయని గుర్తు చేశారు. ఆ విధానాలను వ్యతిరేకించే విధంగా కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. అదే రకంగా రాష్ట్రాభివృద్ధికి ఆయన అనుసరించే విధానాలపైనా స్పష్టత ఉండాలని సూచించారు. కొన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయనుకుంటే పొరపాటని తెలిపారు.
దానాలు, ధర్మాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోవని స్పష్టం చేశారు. భూమి, ఉద్యోగం, పరిశ్రమల కల్పన వంటి విషయాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి చాలా తక్కువని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికపైనా కేసీఆర్ దృష్టిపెట్టడం మంచిదని సూచించారు.
పెట్రోల్ ధరల పెంపుపై మోడీ వ్యాఖ్యలు అబద్ధం
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలు, వసూలు చేస్తున్న పన్నులే కారణమంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడం దారుణమనీ, ఆ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తున్నదని గుర్తు చేశారు. వారం రోజుల్లోనే ఆ ధరలను ఎనిమిది సార్లు పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితే రెండు నెలలపాటు వాటి ధరలను పెంచడం లేదని తెలిపారు.
ఆ భారమంతా ఒకేసారి ప్రజానీకంపై మోపడానికి మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని వివరించారు. అందుకే రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారని విమర్శించారు. పెట్రో ఉత్పత్తులపై దాదాపు ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తున్నదని పేర్కొన్నారు. అందులో 49 శాతం వాటా రాష్ట్రాలకు న్యాయబద్ధమైన హక్కుగా రావాలని తెలిపారు. ఆ వాటాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని వివరించారు.
సెస్‌ల రూపంలో దాన్ని వసూలు చేయడం వల్ల నేరుగా కేంద్ర ఖజానాకు ఆ నిధులు వెళ్తున్నాయని పేర్కొన్నారు. పన్నుల రూపంలో వసూలు చేస్తే రాష్ట్రాలకు 49 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అలా చేయకుండా సెస్ రూపంలో వసూలు చేయడంతో రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత మోసం, దగాకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని విమర్శించారు. మళ్లీ రాష్ట్రాలపైనే దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.