Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధానాలు మార్చేందుకు లౌకికశక్తులన్నీ ఏకంకావాలి
- రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న మోడీ సర్కార్
- ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం
- దోపిడీలేని సోషలిస్టు సమాజాన్ని నిర్మిస్తాం
- ఇదే మల్లు స్వరాజ్యానికి ఇచ్చే నివాళి : సంస్మరణ సభలో సీపీఐ(ఎం)
- ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ.. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీని గద్దెదింపటమే లక్ష్యమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను మార్చేందుకు లౌకికశక్తులన్నీ ఏకంకావాలన్నారు. రాజ్యాంగాన్ని, లౌకికవిలువలను, ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కారు ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. దోపిడీలేని సోషలిస్టు సమాజాన్ని నిర్మించటమే మల్లు స్వరాజ్యానికి మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు.
సూర్యాపేట నుంచి బొల్లె జగదీశ్వర్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో జరిగింది. అంతకుముందు.. కుడకుడ రోడ్డులోని బాలాజి రైస్ మిల్లు నుంచి సూర్యాపేటలోని గాంధీపార్కు వరకు మహాప్రదర్శన సాగింది. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. దేశాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు. ప్రజలకు అనుకూలంగా సోషలిస్టు వ్యవస్థను నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. ఆమె జీవితం తరతరాలకు ఆదర్శమని అన్నారు. ఆమె త్యాగాలు, పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆమెకు జోహార్లు అర్పించటమంటే.. విప్లవాన్ని సాధిస్తామని ప్రతినబూనటమేనని అన్నారు. ఆమె పోరాటస్ఫూర్తిని ముందుకు తీసుకెళతామని చెప్పారు. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం మార్క్సిస్టు పార్టీ కట్టుబడిఉందన్నారు. వామపక్షాల ఐక్యత, వర్గపోరాటాలను బలపరచాలని సూచించారు. పోరాటం ఎప్పుడూ ఆగబోదని, సోషలిజం వచ్చేవరకూ అది కొనసాగుతుందని అన్నారు. మతతత్వ బీజేపీని అధికారం నుంచి దించటమే ప్రజలముందున్న లక్ష్యమని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవాల పేరుతో వేడుకలను నిర్వహిస్తున్నదని అన్నారు. పాలనకు, అధికారానికి కేంద్రమైన రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నదని తెలిపారు. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంభన, సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కుల కోసం ఉన్న ఫెడరల్ వ్యవస్థపై కేంద్రం దాడి చేస్తున్నదని విమర్శించారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. మానవహక్కులను, ప్రజాస్వామ్య విలువలను మోడీ ప్రభుత్వం హరిస్తున్నదని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదన్నారు. కార్పొరేట్లకు సంబంధించిన రూ.11 లక్షల కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం మాఫీచేసిందన్నారు. నిరుద్యోగం, ధరలు, ఆకలి, పేదరికం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంకోవైపు సంపన్నుల సంపద పెరుగుతున్నదని వివరించారు. రాష్ట్రాలు పన్ను తగ్గిస్తే.. పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రధాని మోడీ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీలను కేంద్ర ప్రభుత్వమే విధిస్తున్నదని గుర్తుచేశారు. 2018-21 మధ్యలో పన్నుల ద్వారా కేంద్రానికి రూ.8లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు. ఈ డబ్బంతా ప్రజలకోసం కాకుండా.. కార్పొరేట్ల కోసం ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. దేశంలో దళితులు, గిరిజనులు, మహిళల మీద దాడులు పెరిగాయని చెప్పారు.
కమ్యూనిస్టులపై కేసీఆర్ అబద్దాలు
ఇటీవల హైదరాబాద్లో కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకే తమ పార్టీ బృందం వెళ్లి కలిసిందని ఏచూరి స్పష్టంచేశారు. లౌకికశక్తులు కలవాలని, మోడీ నిరంకుశ విధానాలు పెరుగుతున్నాయనీ, అందరం కలిసి వెళ్లాలని కేసీఆర్ తమతో అన్నారని ఏచూరి చెప్పారు. కానీ, వామపక్ష నాయకులు వచ్చి మోడీని గద్దెదించాలని చెపితే.. ప్రజల సౌకర్యాలు పెంచటం కోసం ప్రత్యామ్నాయ ఎజెండా తీసుకురావాలని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారని తెలిపారు. ఇది అబద్దమని ఏచూరి చెప్పారు. ప్రజల సౌకర్యాలు మెరుగుపరచటం కోసం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం, ఆర్థిక వ్యవస్థను రక్షించటం కోసం ప్రత్యామ్నాయ విధానాలు కావాలని తాము చెప్పామన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ఎందుకు ప్లేటు మార్చారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
వామపక్షాలతోనే తెలంగాణకు విముక్తి : తమ్మినేని
వామపక్ష పార్టీలతోనే తెలంగాణకు విముక్తి సాధ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అందుకోసమే రాష్ట్రంలో వామపక్షశక్తులన్నీ ఏకంకావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో ప్రజలముందుకు వస్తామనీ, ప్రత్యామ్నాయ మార్గం చూపే సత్తా వామపక్షాలకే ఉందన్నారు. పోరాటాలు నిర్మించి బూర్జువా పార్టీలకు దడపుట్టిస్తామని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్తామన్నారు. కమ్యూనిస్టులు కలవాలని, ప్రజాసంఘాలు ఐక్యంకావాలన్నారు. అదే మల్లు స్వరాజ్యానికి ఇచ్చే నివాళి అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలుసాగనివ్వబోమన్నారు. హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెడితే.. ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాషాయ విషాన్ని చిమ్మితే దాన్ని ఎండగడతామనీ, అడ్డుకుంటామని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు కావాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారని తెలిపారు. దీనికి పూర్తివిరుద్ధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ అంశం మీద ట్యాంక్బండ్మీద చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ఫ్రంట్లు కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా కావాలన్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నది ఎవరని ప్రశ్నించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కేసీఆర్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఖాళీ భూముల్లో ఎర్రజెండాలు పాతటానికి మేం సిద్ధం.. పంచేందుకు మీరు సిద్ధమా అని కేసీఆర్ను ప్రశ్నించారు.
ఆమె చరిత్ర త్యాగాలమయం : జూలకంటి రంగారెడ్డి
అందరికీ అమ్మ మల్లు స్వరాజ్యమని అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆమె ఒక వ్యక్తికాదనీ.. శక్తి అని చెప్పారు. చిన్న వయస్సు నుంచి చనిపోయేవరకు సమాజం కోసం, కష్టజీవుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రజలవాణిని వినిపించారని చెప్పారు. ప్రజా ప్రతినిధిగా మచ్చలేని నాయకురాలిగా పేరుగాంచారని అన్నారు. ఆమె చరిత్ర త్యాగాలమయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, పోతినేని సుదర్శన్రావు, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, నాయకులు మల్లు గౌతంరెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వెంకన్న, రైతుకూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.