Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికే చికిత్స చేయాలి
- కూల్చడం సులభం..నిర్మించటమే కష్టం : ఇప్తార్ విందులో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''బెంగుళూరులో జరుగుతున్న అల్లర్లను చూస్తున్నాం.. దేశమంతా ఇలాగే జరుగుతున్నాయి. ఇది సరైంది కాదు. అల్లరి మూకల ఆటలు సాగనీయొద్దు. దుష్టశక్తుల ఆటలను కట్టడిచేయాలి. ప్రజలకు కూడా ఇది అర్థమవుతున్నది'' అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో ముస్లిం సోదరులకు శుక్రవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్రంలో పరిస్థితులు బాగోలేవన్నారు. కేంద్రానికి రోగమొచ్చిందనీ, దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ కూడా దేశంలో భాగమేననీ.. దేశం, రాష్ట్రం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారని తెలిపారు. 2014 లో రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు పెరిగిందని చెప్పారు. మన తలసరి ఆదాయంలో దేశానిది సగం కూడా లేదన్నారు. కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రం కూడా బలహీనంగానే ఉంటుందనీ, కారణాలేమైనప్పటికీ కేంద్రంలో గడబిడ ఉంటే దాన్ని కచ్చితంగా ఆపాలని చెప్పారు. కేంద్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరముందన్నారు. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులపాలుకానివ్వొద్దని చెప్పారు. దేన్నైనా కూల్చడం చాలా సులభమనీ, నిర్మించడమే చాలా కష్టమని చెప్పారు. కేంద్రానికి ఈ విషయం అర్థం కావటం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం క్రమంగా ప్రజలకు కూడా ఇది అర్థమవుతోందన్నారు. దుష్టశక్తుల ఆటలు ఎక్కువకాలం సాగవనీ, కొన్నిరోజుల పాటు వారిదే పై చేయి అయినట్టు కనిపించినా.. చివరికి మానవత్వమే గెలుస్తుందని చెప్పారు. గతంలో తెలంగాణలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ, కానీ.. పరిస్థితి ఇప్పుడు మారిపోయిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పోతున్నదన్నారు. దేశం అంధకారంలో ఉంటే.. రాష్ట్రం మాత్రం విద్యుత్కాంతులతో విరాజిల్లుతోందని చెప్పారు. మైనార్టీ పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.