Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర విచారణ జరపాలి : బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర టూరిజం శాఖకు సంబంధించిన హరితహోటళ్లను టీఆర్ఎస్ నేతలు వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకుని, డబ్బులు చెల్లించడం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విమర్శించారు. ప్రభుత్వానికి రూ 300 కోట్లు చెల్లించకపోవడంతో ఇందులో పెద్ద కుంభకోణం ఉందనే అనుమానాలున్నాయనీ, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాగ్ రిపోర్టు ఆధారంగానే తాను ఇలాంటి విషయాలు బహిర్గతం చేస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఒక రూపాయి కట్టకుండా జలవిహార్‌లో దావత్ చేసుకున్నారని తెలిపారు. దస్పల్లా హోటల్లో ఐఏఎస్ ఉన్నతాధికారులు 'గెట్ టు గెదర్' నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ వరకు ప్రభుత్వం ఒక్కరికి కూడా నోటీసులు పంపలేదని చెప్పారు. పీపీపీ ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ఏసీబీ డీజీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేస్తే....దొంగలకు తాళాలు ఇచ్చినట్టు టూరిజం శాఖ అధికారులు విచారణ చేయాలని ఆదేశించారని చెప్పారు. పీపీపీ ప్రాజెక్టు ఎవరి చేతుల్లో ఉన్నాయి? హరిత హౌటళ్లు ఎవరికి లీజ్‌కు ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఈ అంశాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించాలని కోరారు. టూరిజం శాఖ ఎండీ మనోహర్‌రావుపై లైంగిక దాడుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.